Homeజాతీయ వార్తలుBRS vs Congress: ఆ రెండు వర్గాల ఓట్ల కోసం.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌.. నువ్వా నేనా!

BRS vs Congress: ఆ రెండు వర్గాల ఓట్ల కోసం.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌.. నువ్వా నేనా!

BRS vs Congress: తెలంగాణ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అన్ని పార్టీలు ప్రచారం జోరు పెంచుతున్నాయి. మరో రెండు రోజుల్లో(నవంబర్‌ 15) బరిలో నిలిచేది ఎవరో తేలిపోతుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంపైనే దృష్టిపెట్టేలా ప్రణళిక సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరికి వారు తమదే గెలుపు అని చెబుతున్నా.. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌ కంచుకోటలపై కాంగ్రెస్‌ ప్రత్యేక ఆపరేషన్‌ ప్రారంభించింది. కాంగ్రెస్‌ బలమైన అభ్యర్థులు ఉన్నచోట బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది. ఇక, మారుతున్న లెక్కలతో తెలంగాణలో గెలుపెవరిదో అంతు చిక్కడం లేదు. మరోవైపు బీజేపీ రెండు వర్గాలను టార్గెట్‌ చేసి ఇచ్చిన హామీలు ఎన్నికల సమరాన్ని మరింత ఆసక్తిగా మార్చాయి.

బీఆర్‌ఎస్‌ దూకుడు..
తెలంగాణలో హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన బీఆర్‌ఎస్‌ తరఫున సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌ స్టార్‌ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతం కంటే భిన్నంగా ఎన్నికల ప్రచారంలో ఎమోషనల్‌ అంశాల కంటే ఆలోచన పెంచే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ గెలవకపోతే ఏం జరుగుతుందో వివరిస్తున్నారు. ప్రతీ సభలోనూ గెలుపు బీఆర్‌ఎస్‌ దేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 95 సీట్ల వరకు తాము గెలుస్తామని చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో ఎలక్షన్‌ వార్‌ రూమ్‌ నుంచి ప్రతీ నియోజకవర్గంలో పరిస్థితులను రోజూ గమనిస్తున్నారు. అవసరమైన సూచనలు చేస్తున్నారు. 22 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా చేపట్టాల్సిన ఆపరేషన్‌ను డిసైడ్‌ చేసినట్లు తెలుస్తోంది.

వేగంగా మారుతున్న లెక్కలు..
ఇటు కాంగ్రెస్‌ తమదే గెలుపు అనే ధీమాతో ఉంది. మౌత్‌ పబ్లిసిటీ ఇప్పటి వరకు కాంగ్రెస్‌ కు అనుకూలంగా కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ కంచుకోటగా ఉన్న నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తోంది. అక్కడ బీఆర్‌ఎస్‌ను దెబ్బ తీస్తే గెలుపు తమదే అనే ధీమాతో ఉంది. అదే సమయంలో నేరుగా సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పోటీకి దిగారు. అభ్యర్థుల ఎంపికపైన ఈసారి కాంగ్రెస్‌లో పెద్దగా వ్యతిరేకత కనిపించ లేదు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను వినూత్న ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. రాహుల్‌ సైతం మరోసారి తెలంగాణలో ప్రచారానికి వస్తున్నారు. రేవంత్‌ కీలక నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దీంతో లెక్కలు వేగంగా మారుతున్నాయి.

రెండు వర్గాలపై బీఆర్‌ఎస్‌ నజర్‌..
ఇక, బీజేపీ కొత్త అస్త్రాలతో ఎన్నికల బరిలోకి దిగింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కు భిన్నంగా సామాజిక సమీకరణాలను నమ్ముకుంది. బీసీ సీఎం నినాదం.. ఎస్సీ వర్గీకరణ పైన హామీతో ఓటింగ్‌ తమకు అనుకూలంగా మారుతుందనేది బీజేపీ నేతల ఆలోచన. ఇదే సమయంలో ఈ రెండు నిర్ణయాలతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై పడే ప్రభావం ఎంతనేది కీలకంగా మారుతోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు బీజేపీ ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకుంటూనే పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్‌ వర్సస్‌ బీఆర్‌ఎస్‌ మధ్య హోరా హోరీ పోరు కనిపిస్తున్నా.. బీజేపీ ఫోకస్‌ చేసిన రెండు మెజార్టీ ఓటింగ్‌ వర్గాలు ఎంత మేర మద్దతిస్తాయి.. ఈ రెండు పార్టీల్లో ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బ తీస్తాయనేది కీలకం. దీంతో, తెలంగాణలో ప్రతీ సీటు.. ప్రతీ ఓటు ప్రతీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version