CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓట్లను కొల్లగొట్టేందుకు, మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో షెడ్యూల్ కన్నా రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించారు. మేనిఫెస్టో రిలీజ్ చేశారు. విపక్షాల కంటే ముందే ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుండిపోవడం పెను సంచలనంగా మారింది. అయితే ఈ విషయం మీడియాలో ప్రచారం కాకుండా కేసీఆర్ సర్కార్ మేనేజ్ చేయగలిగింది. కానీ, విపక్షాల రంగప్రవేశం, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం దాచేందుకు గులాబీ బాస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
తప్పు మీద తప్పు…
ఇక కేసీఆర్ ఎన్నికల వేళ తప్పు మీద తప్పు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయాన్ని దాచే ప్రయత్నం మొదటి తప్పు కాగా, తాజాగా దాని వెనుక కుట్రకోణం ఉందని ఇంజినీరింగ్ అధికారులతో పోలీసులకు ఫిర్యాదు చేయించడం. బ్యారేజీ కుండగంపై మావోయిస్టుల చర్యలు లేవని ఇప్పటికే పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో ఎన్నికల్లో తన వైఫల్యం కప్పి పుచ్చుకోవడానికి రాజకీయ కుట్ర ఉందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేలా పోలీసులకు ఫిర్యాదు చేయించారు. అయితే ఈ వ్యవహారం చూస్తుంటే వినేవాడు వెర్రోడు అయితే.. చెప్పేవాడు ఎన్నయినా చెబుతాడు అన్నట్లు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను తమ ఖాతాలో వేసుకున్న కేసీఆర్ అండ్ కో… నిర్మాణ లోపాలను మాత్రం విపక్షాల ఖాతాలో వేయాలని చూడడమే ఆశ్చర్యం వేస్తోంది.
కుంభకోణాన్ని కుట్ర కోణంగా మార్చే వ్యూహం..
వాస్తవానికి ప్రస్తుతం పాలన పూర్తిగా ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్లిపోయింది. విచారణకు ఆదేశిస్తే.. ఎన్నికల సంఘం ఆదేశించాలి. లేదా కేంద్రం జోక్యం చేసుకుని విచారణ చేయాలి. కానీ, ఎవరూ ఆదేశించకుండానే ఇంజినీరింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించామని నేషనల్ జియోగ్రఫీ చానెల్‌లో ప్రచారం చేయించుకున్న కేసీఆర్.. నిర్మాణ లోపాలపై నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కుంభకోణాన్ని కుట్రకోణంగా మార్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు నుంచి గతంలోనేశబ్దాలు వచ్చాయని చెప్పన అధికారులు, ఇప్పుడు కుట్ర ఉందని ఫిర్యాదు చేయడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో ప్రజలకు అర్థమవుతోంది.
రాష్ట్ర సంపద మొత్తం ప్రాజెక్టుకే..
దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహించారు. అయితే దీంతో ఆశించిన ప్రయోజనం మాత్రం నెరవేరలేదు. గోదావరి నీటిని ఎత్తి పోసి.. వర్షాలు రాగానే కిందకు వదిలేయడం రెండు మూడేళ్లుగా జరుగుతున్న ప్రక్రియ. ఈ మాత్రానికి కేసీఆర్ రూ.లక్ష కోట్లు ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేయడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలోని ఇతర పనులకు నిధులు ఆపేసి మరీ నిర్మించిన కాళేశ్వరం ప్రారంభించిన నాలుగేళ్లకే ఇలాంటి పరిస్థితి రావడం తెలంగాణ ప్రజలు మాత్రం హర్షించరు.