Megastar Chiranjeevi: వైసీపీ శ్రేణుల నుంచి చిరంజీవి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా సినిమా రంగంపై ఎందుకు పడతారని.. పిచ్చుక లాంటి సినిమా రంగంపై బ్రహ్మాస్త్రం ఎందుకని చిరంజీవి ప్రశ్నించారు. అప్పటినుంచి చిరంజీవిని వైసీపీ నేతలు టార్గెట్ చేసుకున్నారు. అసలు ఈ రాష్ట్రానికి చిరంజీవి చేసినది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అదే రేంజ్ లో చిరు అభిమానులు, జనసేన సైనికులు ప్రతిస్పందిస్తున్నారు.గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.
తాజాగా మెగా బ్రదర్స్ తో పాటు జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రజారాజ్యం పార్టీ శాసనసభ పక్ష నేతగా చిరంజీవి ఉన్న సంగతి తెలిసిందే. నాడు ఆయన అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతుల దుర్భర స్థితిని ప్రస్తావించారు. ఆర్థిక భారంగా పరిగణించకుండా కౌలు రైతు కుటుంబాలకు ఇతోధికంగా సాయపడాలని అప్పటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, రసాయనాలు అందించాలని చిరంజీవి కోరారు. పండిన పంటకు గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఎటువంటి షరతులు, నిబంధనలు లేకుండా రైతులకు నేరుగా సాయమందించాలని అప్పటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం నాటి చిరంజీవి అజెండాతోనే ముందుకు సాగుతున్నారు. రైతాంగానికి మేలు జరగాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల దుర్భర స్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా యాత్రను చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న మూడు వేలమంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు వంతున సాయం అందించారు. రైతు సమస్యలను అజెండాగా తీసుకొని పోరాడుతున్నారు. రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు.
రైతుల విషయంలో ఉదారంగా ఉండే మెగా బ్రదర్స్ పై వైసీపీ నేతలు విమర్శల దాడి చేస్తుండడం పై జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నాడు చిరంజీవి అసెంబ్లీలో చేసిన ప్రసంగ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. రాష్ట్రానికి చిరంజీవి ఏమీ చేయలేదన్న వైసీపీ నేతల విమర్శలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు.ఈ వీడియోలనే జన సైనికులు ట్రోల్ చేస్తున్నారు. నెటిజెన్లకు తెగ ఆకట్టుకుంటున్నాయి.ఇప్పుడు చెప్పండి వైసీపీ బ్యాచ్ అంటూ సెటైర్లు పడుతున్నాయి.