AP Politics: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో విపక్ష నేత చంద్రబాబు అరెస్టుతో హై టెన్షన్ నెలకొని ఉంది. ఇటువంటి తరుణంలో ఎన్నికల ఫలితాలు, పొత్తుల సమీకరణలు, కోర్టు విచారణలు వంటి వాటితో చలి ఎక్కువగా ఉండే డిసెంబర్ నెలలోనే పొలిటికల్ హీట్ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే నెల ఇరు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్లో ఫలితాలు వెల్లడించనున్నారు. అధికార బీఆర్ఎస్,కాంగ్రెస్, బిజెపిల మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉంది. హోరాహోరీ ఫైట్ కొనసాగనుంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఏపీపై ప్రభావం చూపనున్నాయి. తెలంగాణలో వచ్చే ఫలితం బట్టి రాజకీయ పార్టీలు ఏపీలో తమ వ్యూహాన్ని అమలు చేయనున్నాయి. బిఆర్ఎస్ అధికారంలో వస్తే కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం పడనుంది. కాంగ్రెస్ అధికారంలో వస్తే మాత్రం ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలే మారిపోనున్నాయి. అటు బిజెపి సైతం గెలుపోటములతో ఏపీలో కీలక నిర్ణయం తీసుకోనుంది.
మరోవైపు మూడు రాజధానుల కేసు విచారణ సుప్రీంకోర్టులో డిసెంబర్లో రానుంది. చాలా రోజులుగా ఈ కేసు పెండింగ్లో ఉంది. డిసెంబర్లో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే సీఎం జగన్ తన క్యాంప్ ఆఫీసును విశాఖలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిషికొండ నిర్మాణాలు క్యాంప్ ఆఫీస్ కోసమేనని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లో న్యాయస్థానం విచారణ చేపట్టి స్పష్టమైన తీర్పు వస్తే మాత్రం సంచలనం గా మారే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే వైసిపి పై తీరని ప్రభావం చూపే అవకాశం ఉంది.
అటు డిసెంబర్లో పొత్తుల వ్యవహారం సైతం తేలిపోనుంది. తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలను అనుసరించి బిజెపి ఏపీలో వ్యూహాన్ని ఖరారు చేయనుంది. ఇప్పటికే టిడిపి, జనసేన కూటమి కట్టాయి. బిజెపి కనుక ఆ కూటమిలో చేరితే జగన్ ఎలా స్పందిస్తారు అన్నది కీలకంగా మారింది. మరోవైపు చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నవంబర్లో ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై టిడిపి గట్టిగానే పోరాటం చేస్తుంది. చంద్రబాబు బయటకు వచ్చిన మరుక్షణం కీలక రాజకీయ నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ బిజెపితో కలిసి నడవాలనుకుంటున్నారా? లేకుంటే ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ నిర్ణయం కూడా డిసెంబర్ లోనే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలకు డిసెంబర్ వేదికగా మారడం ఖాయంగా తెలుస్తోంది.