కేంద్రంలో బీజేపీ సర్కారు వరుసగా రెండు సార్లు కొలువుదీరింది. 2024లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆరాటపడుతోంది. అదే సమయంలో.. మోడీని ఓడించాలని విపక్షాలు బలంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ బలహీనంగా మారిపోయిన నేపథ్యంలో.. మూడో ఫ్రంట్ తో గెలుపు సాధించాలని భావిస్తున్నాయి. ఇందుకోసం మూడేళ్ల ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇవాళ ఢిల్లీలో విపక్షాలు భేటీ కాబోతున్నాయి.
ఈ మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోపాటు.. బీజేపీ సీనియర్ నేతగా సుదీర్ఘ కాలం పనిచేసి, ఈ మధ్యనే తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన యశ్వంత్ సిన్హా ప్రయత్నిస్తున్నారు. ఈ సమావేశం వీరిద్దరూ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ‘మిషన్ – 2024’ పేరుతో ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
బెంగాల్లో ఓటమితోపాటు.. కరోనాను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలమైందంటూ జరిగిన ప్రచారం.. బీజేపీకి ఇబ్బందికరంగానే ఉంది. ఈ పరిస్థితిని వినియోగించుకోవడం ద్వారా.. మోడీ సర్కారుపై పైచేయి సాధించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. మూడో ఫ్రంట్ కు రూపురేఖలు తెచ్చేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ భేటీకి చాలా మందికి ఆహ్వానాలు పంపించారు. వీరిలో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ నుంచి యశ్వంత్ సిన్హా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్, సీపీఐ నుంచి డి.రాజా వంటి నేతలు సుమారు 20 మంది వరకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీల నేతలతోపాటు సీనియర్ లాయర్ ఖురేషీ, ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్, బాలీవుడ్ ప్రముఖుడు జావేద్ అక్తర్ తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు.
అయితే.. ఈ మూడో ఫ్రంట్ బీజేపీని ఓడించగలదా? దానికి ఎంత వరకు అవకాశం ఉంది? అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉంది కాబట్టి.. ఈ క్రమంలో వచ్చే సహజ వ్యతిరేకతకు తోడు, బెంగాల్ ఎన్నికల్లో ఓటమి, కరోనా వంటి అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. దీంతోపాటు దేశం మొత్తం దృష్టిసారించే ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని, ఇక్కడ ఓడించడం ద్వారా ఢిల్లీకి మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తున్నారు.
ఈ మేరకు యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ఓ కూటమిని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. మరి, ఈ లోగా పరిస్థితులు ఎటైనా మారొచ్చు. యూపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఎవ్వరూ చెప్పలేరు. అందువల్ల ఏం జరుగుతుందన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Third front will defeat modi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com