https://oktelugu.com/

America : అమెరికాలో కోడిగుడ్ల కోసం కొట్టుకుంటున్నారు.. లక్ష గుడ్ల దొంగతనం.. హతవిధీ.. ఏందుకీ పరిస్థితి?

అమెరికాలో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని నెలలుగా గుడ్ల ధరలు 15శాతం పెరిగి, ఈ ఏడాది మరింత 20శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Written By:
  • Rocky
  • , Updated On : February 13, 2025 / 06:14 PM IST
    America

    America

    Follow us on

    America : అమెరికాలో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని నెలలుగా గుడ్ల ధరలు 15శాతం పెరిగి, ఈ ఏడాది మరింత 20శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో గుడ్ల సరఫరాలో తీవ్రమైన కొరత ఏర్పడటంతో అనేక స్టోర్లలో ‘లిమిటెడ్‌ స్టాక్‌’ బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని ఇతర స్టోర్లలో ‘నో ఎగ్స్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీని కారణంగా కోడిగుడ్ల విక్రయంపై చాలా స్టోర్లు పరిమితి విధించాయి. ఒక్కరికి గరిష్ఠంగా రెండు లేదా మూడు ట్రేలు మాత్రమే అమ్ముతున్నాయి.

    కోడిగుడ్ల ధర పెరిగే ప్రధాన కారణాలు
    అమెరికాలో కోడిగుడ్ల ధరల పెరుగుదలకి ప్రధాన కారణం సరఫరా. మరో ప్రముఖ కారణం బర్డ్‌ ఫ్లూ (Bird Flu) వ్యాప్తి. గత కొన్ని నెలలుగా ఈ వ్యాధి దేశవ్యాప్తంగా తీవ్రంగా విస్తరించి, కొన్ని ప్రాంతాల్లో కోళ్ల మరణాలు ఎక్కువయ్యాయి. అమెరికా వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం.. 2022 డిసెంబర్‌లోనే సుమారు 2.3 కోట్ల కోళ్లను వధించినట్లు తెలిపింది. ఒహాయో, మిస్సౌరీ రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ ప్రభావం అత్యధికంగా కనిపించింది. ఈ దెబ్బకు కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా ధరలు పెరిగాయి. ఈ పరిస్థితిలో కోడిగుడ్ల ధరలు 2022 జనవరిలో డజను కోడిగుడ్ల ధర 2.52డాలర్లు ఉండగా, డిసెంబర్ నాటికి అది 4.15డాలర్లకి పెరిగింది. ప్రస్తుతం కోడిగుడ్ల ధర 7.34 డాలర్లకు చేరింది.

    స్టోర్లపై పరిమితి విధింపు
    కోడిగుడ్ల ధరలు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలు ఎక్కువ మొత్తంలో గుడ్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా సూపర్‌ మార్కెట్లు వీటిపై పరిమితులు విధించాల్సి వచ్చాయి. ఉదాహరణకి, ‘ట్రేడర్‌ జో’ వంటి స్టోర్లు రోజుకు ఒక్కరికి ఒక డజన్ కోడిగుడ్లు మాత్రమే ఇవ్వడం ప్రారంభించాయి. ‘హోల్‌ ఫూడ్స్‌’ వంటి సంస్థలు మూడు కార్టన్‌లను మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతిస్తున్నాయి. అలాగే ‘క్రోగర్’ స్టోర్ రెండు డజన్లు మాత్రమే ఇచ్చే విధంగా పరిమితి విధించింది.

    హోటల్స్‌పై ప్రభావం
    కోడిగుడ్ల ధరలు పెరిగిన తర్వాత, రెస్టారెంట్లపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా, వాఫిల్ హౌస్ వంటి రెస్టారంట్లు గుడ్డుపై 50శాతం అదనపు రుసుం వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వ్ చేసే ఆహారాలలో కోడిగుడ్ల ధర పెరిగింది. తద్వారా రెస్టారెంట్లు తమ ఖర్చులను తగ్గించుకోవడం కోసం ధరల పెరుగుదల నుంచి ప్రభావితమయ్యాయి.

    మరింత ధరలు పెరగవచ్చన్న అంచనాలు
    అమెరికాలో కోడిగుడ్ల ధరలు వచ్చే కొన్ని నెలలలో మరింత పెరగాలని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సరఫరా సమస్యలు ఇంకా కొనసాగుతుండడంతో ధరలపై ఇంకా పెరుగుదల కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితి సామాన్య ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ప్రజలు ఇంత విపరీతమైన ధరల పెరుగుదల వల్ల దాదాపు కోడిగుడ్ల కొనుగోలులో పరిమితులను అనుసరించాల్సి వస్తోంది.

    కోడి గుడ్ల దొంగతనం
    ఈ క్రమంలోనే అమెరికాలో సుమారు 35 లక్షల రూపాయల విలువైన గుడ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఏకంగా లక్ష గుడ్లను దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఈ విషయం కాస్తా చర్చనీయాంశంగా మారింది. అమెరికా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కోడి గుడ్ల కొరత నెలకొనగా.. ఇప్పుడు ఏకంగా లక్ష గుడ్లు దొంగతనానికి గురి కావడం సంచలనంగా మారింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రీన్‌క్యాసెల్‌ నగరంలో ఉన్న పీట్‌ అండ్‌ గ్యారీస్‌ ఆర్గానిక్స్‌ ఎల్‌ఎల్‌సీ సంస్థకు చెందిన లక్ష గుడ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. రిటైల్ షాపులకు సరఫరా చేసేందుకు గుడ్లను లారీల్లో లోడ్ చేయగా ఆ లోడ్ నుంచి దొంగలు కోడి గుడ్లను ఎత్తుకెళ్లినట్లు సదరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

    చోరీ అయిన గుడ్ల విలువ 40 వేల డాలర్లు అని.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.35 లక్షలు ఉంటుందని సమాచారం.గత కొన్ని రోజులుగా కోడి గుడ్ల కొరతతో అమెరికావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు ఏళ్ల క్రితం డజన్ గుడ్లు ఒక డాలర్ అంటే మన కరెన్సీలో రూ.84 ఉండగా.. ఇప్పుడు అదే డజన్ గుడ్ల ధర ఏకంగా 7 డాలర్లు అంటే దాదాపు రూ.590 పలుకుతున్నట్లు చెబుతున్నారు. గుడ్ల కొరత కారణంగానే ఒక్కసారిగా వీటి ధర అమాంతం పెరిగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.