ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగించింది. అన్ని జిల్లా పరిషత్ లను కైవసం చేసుకుని సత్తా చాటింది. 13 జిల్లాల్లో అధికార పార్టీ అభ్యర్థులే జయకేతనం ఎగురవేయడం గమనార్హం. దీంతో తిరుగులేని పార్టీగా వైసీపీ నిలిచింది. రాష్ర్ట వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 640 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అన్ని జిల్లాల్లో నేటి ఉదయం 10 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయింది.

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రిసైడింగ్ అధికారి కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఒక్కో జిల్లాలో ఇదద్రు చొప్పున కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, జిల్లాకు ఇద్దరు చొప్పున వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా పదవుల కోసం అభ్యర్థులను ప్రభుత్వం ఎంపిక చేసింది.
చైర్మన్ తోపాటు వైస్ చైర్మన్ ను జెడ్పీటీసీలు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ లలో ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తవుతూనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మొదలు కానుంది. ఇద్దరు వైస్ చైర్మన్ల ఎంపిక కోసం పంచాయతీ రాజ్ చట్టం సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది.
విజయనగరం- మజ్జి శ్రీనివాసరావు, శ్రీకాకుళం-సిరియా విజయ, విశాఖపట్నం- అరబీరు సుభద్ర, తూర్పుగోదావరి-చిప్పర్తి వేణుగోపాలరావు, పశ్చిమగోదావరి-కవురి శ్రీనివాస్, కృష్ణ-ఉప్పాళ్ల హారిక, గుంటూరు-కత్తెర హెనిక్రిస్టినా, ప్రకాశం-బూచేపల్లి వెంకాయమ్మ, నెల్లూరు-ఆనం అరుణ, కర్నూలు-మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, అనంతపురం-గిరిజ, కడప-అకేసాటి అమర్నాథరెడ్డి, చిత్తూరు-శ్రీనివాసులు నూతన చైర్మన్లుగా ఎన్నిక కానున్నారు.
అన్ని జిల్లాల్లో జెడ్పీలు, మున్సిపాలిటీల్లో అన్నింటా వైసీపీ నేతలే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ విజయం దారి చూపుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది. అన్ని జిల్లాల్లో చైర్మన్ల స్థానాలను దక్కించుకుని వైసీపీ ఎదురులేని పార్టీగా నిలిచింది.