Exit Polls: గత మూడు ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే!

2009లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ నాలుగు ఎగ్జిట్ పోల్స్ యూపీఏ విజయాన్ని తక్కువగా అంచనా వేశాయి. యూపీఏకు 195, ఎన్డీఏ కు 185 సీట్లు వస్తాయని అంచనా వేయగలిగాయి.

Written By: Dharma, Updated On : June 1, 2024 2:13 pm

Exit Polls

Follow us on

Exit Polls: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈరోజు తుది పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ కు.. ఎగ్జాక్ట్ పోల్స్ కు మధ్య తేడా ఉంటుందా? ఎగ్జిట్ పోల్స్ ప్రామాణికత ఎంత? గత ఎన్నికల్లో వాస్తవానికి దగ్గరగా ఫలితాలు ఇచ్చాయా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, తుది ఫలితాలు ఒకసారి పరిశీలిస్తే.. అంచనాలు తప్పినట్లు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీకి సంబంధించి అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. విజయం సాధిస్తాయని చెప్పడంలో మాత్రం సక్సెస్ అయ్యాయి.

2009లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ నాలుగు ఎగ్జిట్ పోల్స్ యూపీఏ విజయాన్ని తక్కువగా అంచనా వేశాయి. యూపీఏకు 195, ఎన్డీఏ కు 185 సీట్లు వస్తాయని అంచనా వేయగలిగాయి.అయితే అప్పుడు యూపీఏ కు 252 సీట్లు, ఎన్డీఏకు 158 సీట్లు లభించాయి. యూపీఏ కూటమిలోని కాంగ్రెస్ పార్టీకి 206 సీట్లు, ఎన్డీఏ కూటమిలోని బిజెపికి 116 సీట్లు వచ్చాయి.

2014 ఎన్నికల్లో సైతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. దాదాపు 8 ఎగ్జిట్ పోల్ సంస్థలు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కు 283 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కు 105 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. మోడీ వేవ్ పెరుగుతుందని పసిగట్టలేకపోయాయి. సంస్థల అంచనాలను తారుమారు చేస్తూ ఎన్డీఏ 336 సీట్లను గెలుచుకుంది. యూపీఏ కేవలం 60 స్థానాలకే పరిమితం అయ్యింది. ఒక్క బిజెపికే 282 స్థానాలు రాగా.. కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలకు పరిమితం అయ్యింది.

2019 ఎన్నికల్లో సైతం ఎగ్జిట్ పోల్స్ అనుకున్న స్థాయిలో అంచనాలు సక్సెస్ కాలేదు. ఎన్డీఏ కూటమి 306 సీట్లు సాధిస్తుందని అంచనా వేశాయి 13 ఎగ్జిట్ పోల్స్ సంస్థలు. కానీ ఏకంగా ఎన్డీఏ 353 సీట్లు గెలుచుకోవడం గమనార్హం. ఒక్క బీజేపీ మాత్రమే 303 స్థానాలను గెలుచుకుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఇలా అంచనాలు తప్పుతున్నా… ప్రజల్లో మాత్రం వాటిపై ఆసక్తి తగ్గడం లేదు.