https://oktelugu.com/

Maharashtra-Jharkhand Election 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ రిజల్ట్స్ : రేవంత్ రెడ్డి, భట్టి ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఫలితాలు ఇవీ..

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు.. జార్ఖండ్ ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే ఈ ఇద్దరు కీలక నేతల్లో రేవంత్ ప్రతికూల ఫలితం అందుకోగా.. భట్టి విక్రమార్క అనుకూల ఫలితాన్ని సొంతం చేసుకున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 23, 2024 / 06:22 PM IST

    Maharashtra-Jharkhand Election 2024

    Follow us on

    Maharashtra-Jharkhand Election 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోలాపూర్ సిటీ నార్త్, సౌత్ చంద్రపూర్, భోకార్, సోలాపూర్ సౌత్, నాయగావ్, నార్త్ నాందేడ్ ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమకు, ఆలుగడ్డల సేద్యానికి ప్రసిద్ధి చెందినవి. ఇవి తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇక్కడ తెలుగు వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. తెలంగాణతో బంధుత్వం కలిగిన వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అయితే తెలుగువారి ఓట్లను క్యాష్ చేసుకోవాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డితో ప్రచారం చేయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాలకు సరిహద్దున ఉన్న తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను మట్టికరిపించి భారీగా అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకుంది. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే స్థాయిలో ఫలితాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ పై ఆశలు పెంచుకుంది. అధిష్టానం ఆదేశాలతో రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. కేంద్రం చేస్తున్న తప్పిదాలను ఎండగట్టారు. అయితే ఈ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. ఈ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.

    భట్టి విక్రమార్క కు అనుకూల ఫలితాలు

    తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏఐసిసి సీనియర్ పరిశీలకుడిగా జార్ఖండ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఎన్నికల సరళిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పార్టీ నాయకులకు సూచనలు చేశారు. ఈ వివరాలను పార్టీ హైకమాండ్ కు వెల్లడించారు. అధిష్టానం నిర్ణయాలను కిందిస్థాయిలో అమలు చేశారు. ఫలితంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి విజయం సాధించింది.. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మూర్చ స్పష్టమైన లీడ్ సాధించింది. భట్టి తో పాటు సీనియర్ నాయకులు తన్విర్ అన్వర్, అల్లావూర్ కృష్ణ కూడా అబ్జర్వర్ పాత్రలను పోషించారు. జార్ఖండ్ రాష్ట్రంలో జార్ఖండ్ ముక్తి మూర్ఛ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం కావడంతో.. భట్టి విక్రమార్క రాంచి చేరుకున్నారు. ఎన్నికల ఫలితాల సరళిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే జార్ఖండ్ రాష్ట్రంలో మంత్రివర్గం కూర్పు కు సంబంధించి ఒక నివేదికను భట్టి విక్రమార్క అధిష్టానానికి చేరవేర్చారని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రచారం సాగించిన రాష్ట్రాలలో.. ముఖ్యమంత్రికి ప్రతికూల ఫలితాలు రాగా, ఉపముఖ్యమంత్రికి అనుకూల ఫలితాలు రావడం విశేషమని భారత రాష్ట్ర సమితి నాయకులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తూ.. భట్టి విక్రమార్కపై అభినందనలు కురిపిస్తున్నారు.