Homeజాతీయ వార్తలుMunugodu By Election Congress :  సిట్టింగ్ నుంచి మూడో స్థానానికి: హస్త విలపానికి కారణాలు...

Munugodu By Election Congress :  సిట్టింగ్ నుంచి మూడో స్థానానికి: హస్త విలపానికి కారణాలు ఎన్నో

Munugodu By Election Congress : మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. కానీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. వాస్తవానికి మునుగోడు మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పూర్తిస్థాయి గ్రామీణ నియోజకవర్గమైన మునుగోడులో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది అంటే దానికి కారణం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. ఆయన కన్నుమూసిన తర్వాత ఆయన వారసత్వాన్ని కుమార్తె పాల్వాయి స్రవంతి రెడ్డి తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన ప్రోత్సాహం తప్పకపోవడంతో ఆమె అంతగా వెలుగులోకి రాలేకపోతున్నారు.
ఎవరు సహకరించారు గనుక
మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే బిజెపి తన అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ప్రకటించింది. టిఆర్ఎస్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపు మొగ్గుచూపింది. కాంగ్రెస్ అనేక శషభిషల మధ్య స్రవంతి రెడ్డికి టికెట్ ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ఆమె అభ్యర్థిత్వం ఖరారు అయిందో అప్పటినుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఏకంగా ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఉన్న నేతలు కూడా అంతగా ప్రచారంలో పాలుపంచుకోలేదు. దీంతో స్రవంతి రెడ్డి ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది.. తన తండ్రికి ఉన్న చరిష్మాను గుర్తు చేసుకుంటూ ప్రచారం చేసింది. తాను ఆడబిడ్డనని ఆశీర్వదించాలని కోరింది. ఒకవేళ కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రచారంలో పాలుపంచుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
రాహుల్ జోడో యాత్ర చేసినా
ప్రస్తుతం రాహుల్ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక  పోలింగ్ కు ముందే యాత్ర కర్ణాటక మీదుగా తెలంగాణలో అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి లాంటి కీలక నేతలంతా రాహుల్ వెంటే ఉన్నారు. స్రవంతి రెడ్డి ఒక్కరే ప్రచారం చేసుకున్నారు. పైగా టిఆర్ఎస్, బిజెపి పోటాపోటీగా డబ్బులు పంచడంతో కాంగ్రెస్ బిక్క ముఖం వేసింది. ఒక దశలో  ఓటుకు 500 చొప్పున పంచేందుకు సిద్ధం కాగా.. ఇలా అయితే పరువు పోతుందని స్థానిక నాయకులు తలా కొంత వేసుకొని ఓటుకు వెయ్యి చొప్పున పంచారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం నాయకులంతా రాజగోపాల్ రెడ్డి వైపు వెళ్లడంతో కాంగ్రెస్ లో ఒకింత నైరాశ్యం అలముకుంది. పైగా ప్రచారంలో కూడా ఎవరూ కలిసి రాకపోవడంతో స్రవంతి రెడ్డి రెడ్డి అన్ని తానై వ్యవహరించారు. ఇప్పుడు కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది అంటే దానికి ఆ పార్టీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోవడం ఆ పార్టీలో బేలతనాన్ని సూచిస్తున్నది.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version