Union Budget 2023 Telangana: ఇది ఎన్నికల సంవత్సరం.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ముందస్తు వస్తే గిస్తే లోక్ సభకూ ఎన్నికలు జరగవచ్చు. దీనికి తోడు తెలంగాణపై బిజెపి కన్నేసింది.. ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుడుతున్నారు.. ఈ నేపథ్యంలో బడ్జెట్లో తెలంగాణను కేంద్రం కనికరిస్తుందా? నిధులను విదిలిస్తుందా? ఎప్పటిలాగే మొండి చేయి చూపిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లోనూ ఇదే ఆందోళన నెలకొంది. ప్రతిసారి తాము పలు డిమాండ్లను కేంద్రానికి పంపడం, కేంద్ర ప్రభుత్వ రిక్త హస్తాలు చూపడం పరిపాటిగా మారిందని మండిపడుతున్నాయి..మిషన్ కాకతీయ, భగీరథ వంటి పథకాలకు నిధులు కేటాయించాలంటూ ఏటా బడ్జెట్ కి ముందు తాము డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామని రాష్ట్రం చెబుతోంది.. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఇవేమీ ఉండటం లేదని వాపోతోంది.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద పెండింగ్ లో ఉన్న 1350 కోట్లను విడుదల చేయాలని కోరుతూనే ఉంది. రాష్ట్రం కోరే ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానికీ నిధులు రావడం లేదు.. గిరిజన యూనివర్సిటీకి పది లేదా 50 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు కొంతమేర నిధులు కేటాయించి కేంద్రం చేతులు దులుపుకుంటుంది. అయితే ఈసారి పెద్దగా డిమాండ్లు ఏమీ పెట్టకుండా ప్రభుత్వ పెద్దలు మిన్నకుండిపోయారు.. గత ఏడాది బడ్జెట్ కు ముందు కేటీఆర్, హరీష్ రావు లేఖలు రాశారు.. ఎలాగూ నిధులు ఇవ్వడం లేదన్న నిర్లిప్తతో ఈసారి ఎలాంటి లేఖలు రాయలేదు. మంత్రి కేటీఆర్ మాత్రం రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేయాలంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖలు రాశారు.

ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్రమైన వైరం నెలకొంది.. బీఆర్ఎస్, బిజెపి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో నిధులను కేటాయిస్తుందా అన్న సందేహాలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.. గత ఏడాది కోరిన డిమాండ్లను పరిష్కరించక పోవడంతో బడ్జెట్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంపై విరుచుకుపడ్డారు.. ఈసారి ఏమాత్రం వినతులు ఏమీ చేయలేదు.. కేంద్రం వద్ద తమ డిమాండ్ పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకొని నిధులు ఇస్తే చూద్దాం అని ప్రభుత్వం వేచి చూస్తోంది.
రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు పేట రాష్ట్ర ప్రభుత్వం 40 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టింది.. దీనికి 19205 కోట్లను కేటాయించాలంటూ నీతి ఆయోగ్ సిఫారసు చేసింది.. ఈ నిధులను కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్రం ప్రతీసారి కోరుతోంది.. జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ పథకాన్ని కొనియాడని చెబుతోంది. రాష్ట్రంలో 46 వేల 531 చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టింది.. పథకానికి 5000 కోట్లు ఇవ్వాలంటే నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని రాష్ట్రం కేంద్రానికి ప్రతిసారి గుర్తు చేస్తోంది.. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.. ఆంధ్ర ప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని, అదే మాదిరి తెలంగాణలోనూ ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది.. ప్రత్యేక గ్రాండ్ కింద రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన 723 కోట్లను కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

తన చట్టంలో హామీ ఇచ్చినట్టుగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, వెంటనే 5000 కోట్లు ఇవ్వాలని అడుగుతోంది. వరంగల్లోని మెగా టెక్స్టైల్ పార్కు నిధులు ఇవ్వాలని, ఐఐఎం, కరీంనగర్కు త్రిబుల్ ఐటీతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాలని అడుగుతున్నది.. అయితే ఈ డిమాండ్లపై కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.