Chandrababu: చంద్రబాబుకు లభించింది కేవలం మధ్యంతర బెయిలే. స్కిల్ స్కాంనకు సంబంధించి పూర్తిస్థాయి బెయిల్ విచారణ నవంబరు 10 కి వాయిదా పడింది. అయితే సహేతుకమైన అనారోగ్య కారణాలు చూపడం వల్లే ఆయనకు మధ్యంతర బెయిల్ లభించినట్లు తెలుస్తోంది. ఆయన కుడి కంటికి సంబంధించి ఆపరేషన్ చేయాల్సి ఉంది. జూన్ నెలలో ఆయన ఎడమ కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. మూడు నెలల వ్యవధిలో కుడి కన్ను ఆపరేషన్ చేయాల్సి ఉందని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు సూచించారు. ఆ నివేదికలు పొందుపరచడంతో చంద్రబాబు మధ్యంతర బెయిల్ జారీకి సుగమం అయ్యింది.
ఈ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు దాదాపు 53 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశించింది. అయితే గత కొద్దిరోజులుగా చంద్రబాబు అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయనకు శరీరమంతా దద్దుర్లు వచ్చాయని, కంటి సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మధ్యంతర బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. హైకోర్టులో మాత్రం ఊరట దక్కింది. అయితే కేవలం అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మాత్రమే ఈ బెయిల్ ను వర్తింపజేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
బెయిల్ విచారణ సందర్భంగా న్యాయస్థానం చంద్రబాబుకు పలు కండిషన్లు పెట్టింది. స్వేచ్ఛగా తన ఇంట్లో ఉండవచ్చని.. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళవచ్చని తెలిపింది. రాజకీయ సమావేశాల్లో కానీ.. నేతలతో భేటీలో కానీ పాల్గొన వద్దని తెలిపింది. చంద్రబాబు వెంట ఇద్దరు డిఎస్పీలను ఉంచాలని ఆదేశించింది. అతనికి ఉన్న జడ్ ప్లస్ భద్రతను యధావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇన్ని కండిషన్ల మధ్య చంద్రబాబు బెయిల్ ఉండడంతో.. రాజకీయ కార్యకలాపాలకు వీలు లేదు. ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. మరోవైపు ఫోన్లో సైతం మాట్లాడకూడదని షరతు పెట్టడం కూడా ఇబ్బందికరమే.
నాలుగు వారాలపాటు చంద్రబాబుకు జై లభించింది. నవంబర్ 28న ఆయన తిరిగి జైల్లో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ఇక చంద్రబాబు విడుదలకు సంబంధించి పేపర్ వర్క్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉంది. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బెయిల్ ఇచ్చినట్టే ఇచ్చి.. రాజకీయ కార్యకలాపాలకు వీలు లేకుండా కోర్టు నిబంధనలు విధించడం విశేషం.