Jagan Vs Chandrababu: సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. దాదాపు 53 రోజులపాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలు చూపుతూ బెయిల్ తెప్పించుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. న్యాయం గెలిచింది అంటూ టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో అసలు సిసలు రాజకీయం ప్రారంభం కానుంది అని చెబుతున్నారు. అయితే బెయిల్ వచ్చింది కనుక.. ఆ ఆనందంలో రకరకాలుగా చెప్పుకుంటారు. కానీ గత 50 రోజులుగా టిడిపి శ్రేణులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న మాట వాస్తవం. అయితే ఈ యుద్ధంలో చంద్రబాబు గెలిచారా? జగన్ గెలిచారా? అన్నది.. కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు.
చంద్రబాబుకు తాజాగా లభించింది కండిషన్ బెయిల్ మాత్రమే. కేవలం అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయనకు బెయిల్ లభించిన మాట వాస్తవం. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి విచారణ నవంబర్ 10కి వాయిదా పడింది. అయితే నవంబర్ 8న చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు వెల్లడి కానుంది. ఆ తీర్పును అనుసరించే హైకోర్టులో చంద్రబాబు బెయిల్ విషయంలో స్పష్టత రానంది. ఒకవేళ చంద్రబాబుపై నమోదైన కేసులు క్వాష్ చేస్తే మాత్రం.. చంద్రబాబు రాజకీయంగా దూకుడు పెంచే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఇవి రాజకీయ కక్షపూరిత కేసులని ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీనిని అధిగమించాలంటే ఇక్కడితో జగన్ వెనక్కి తగ్గడమే మేలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ మరింత సాగదీస్తారా? ఇక్కడితో వదిలేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే తాజాగా మద్యం కుంభకోణం కేసు పెట్టడం… అంత ఈజీగా వదలనని జగన్ సంకేతాలు పంపారు.
అయితే చంద్రబాబు మరోసారి జైలుకు వెళ్లాల్సి ఉంటుందా? అంటే మాత్రం సమాధానం లేకుండా పోతుంది. ఒకసారి బెయిల్ లభిస్తే.. దానికి అనుసరించి ఎన్నో కారణాలు చూపించి బెయిల్ పొడిగించుకునే అవకాశాలు ఉన్నాయి. తనపై 16 కేసులు నమోదైతే బెయిల్ పై బయటికి వచ్చిన జగన్ గత పది సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతతో పాటు సీఎంగా సైతం పదేళ్లు పూర్తి చేసుకున్నారు. మరి ఆయనకు మినహాయింపు లభించినట్టే కదా. ఒక్కసారి బెయిల్ మంజూరు అయితే… దాని పొడిగింపునకు సవాలక్ష కారణాలు దొరుకుతాయని న్యాయ నిపుణులే చెబుతుంటారు. ఈ లెక్కన చంద్రబాబు మరోసారి జైలుకు వెళ్లడం జరిగే పని కాదని.. అనివార్య పరిస్థితులు ఎదురైతే కానీ అది జరగదని తేల్చి చెబుతున్నారు.
అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం దానికి జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక ప్రజాక్షేత్రంలో చంద్రబాబుకు అడ్డు ఉండదు. కేసులతో నియంత్రిస్తామంటే కుదరదు. ఆపై కేంద్ర పెద్దల సాయం ఉంటే చంద్రబాబు ఉవ్వెత్తున పైకి లేవడం ఖాయం. ప్రస్తుతానికైతే ఈ కేసు విషయంలో ఎవరు గెలిచారంటే… ఒకటి, రెండు మార్కులతో జగన్ కాస్త ముందంజలో ఉన్నారు. అయితే ఒకవేళ బెయిల్ పొడిగింపు తో పాటు షరతుల విషయంలో మినహాయింపు లభిస్తే మాత్రం చంద్రబాబు దూకుడుగా ముందుకు పోతారు. జగన్ను అధిగమిస్తారు. అయితే అవినీతి కేసుల్లో చంద్రబాబును 50 రోజులు పాటు జైల్లో ఉంచానన్న సంతృప్తి మాత్రం జగన్కు మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.