https://oktelugu.com/

R Gandhi: ఆ కరెన్సీ భారత్ కు అవసరం లేదు: నోట్ల ఉపసంహరణ వేళ ఆర్బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు డిజిటల్ లావాదేవీల వైపు మళ్ళి పోయారు. సాధారణ టీ షాప్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు అన్ని వ్యాపార సంస్థలు కూడా డిజిటల్ విధానంలో చెల్లింపులు స్వీకరిస్తున్నాయి.

Written By:
  • Rocky
  • , Updated On : May 22, 2023 9:58 am
    R Gandhi

    R Gandhi

    Follow us on

    R Gandhi: 2000 నోటును భారత రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఈ నోట్లు ఉన్నవారు సెప్టెంబర్ 30లోగా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని సూచించింది. అయితే రోజుకు 20వేలకు మాత్రమే పరిమితి ఇచ్చింది.. ఈ నిర్ణయం నేపథ్యంలో రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. మరికొంతమంది పెదవి విరుస్తున్నారు. ఇదంతా జరుగుతుండగానే రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ నోట్ల ఉపసంహరణ వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అంతేకాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఆలోచనలో పడేశాయి.

    డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి

    దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు డిజిటల్ లావాదేవీల వైపు మళ్ళి పోయారు. సాధారణ టీ షాప్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు అన్ని వ్యాపార సంస్థలు కూడా డిజిటల్ విధానంలో చెల్లింపులు స్వీకరిస్తున్నాయి. ఒకప్పుడు ఈ విభాగంలో పేటీఎం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, వాట్స్ అప్ పే వంటివి కూడా తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా దేశంలో 500 నోటు మినహా అంతకు మించిన పెద్ద కరెన్సీ వద్దని రిజర్వ్ బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ చెబుతున్నారు. “దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద నోటు అవసరం లేదని” ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.. 2000 నోటు నోట్ల రద్దు సూత్రాలకు విరుద్ధం అయినప్పటికీ, డి మానిటైజేషన్ కారణంగా ఏర్పడిన తక్షణ ద్రవ్య కొరతను తీర్చుకునే స్వల్పకాలిక వ్యూహంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తప్ప లేదన్నారు.

    సానుకూల పరిణామాలు

    2000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో ద్రవ్యపరపతి విధానం పైనే కాకుండా మిగతా విషయాలపై కూడా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.” 2000 ఉపసంహరణతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానంపై ఎలాంటి ప్రభావం ఉండదు. జిడిపి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభావితమయ్యే అవకాశం లేదు. 2016 లో పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో తక్షణ ద్రవ్య కొరతను తీర్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పన్నిన వ్యూహం లో భాగంగా మాత్రమే 2000 నోట్లను ముద్రించింది.” అని గాంధీ పేర్కొన్నారు.. కాగా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఓ వర్గం వారు గాంధీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తుంటే.. మరో వర్గం వారు 2000 నోటు ఉపసంహరణ నిర్ణయం సరైనదేనని చెబుతున్నారు. గాంధీ వ్యాఖ్యల పట్ల సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.