
అదేంటో.. ఏపీలో ఏ ఎన్నికల్లో చూసినా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తూ వస్తోంది. అంతకుముందు సార్వత్రిక ఎన్నికల నుంచి మొన్నటి మున్సిపల్ ఎన్నికల వరకూ వైసీపీదే హవా నడిచింది. కానీ.. టీడీపీలో మాత్రం ఇసుమంతైనా భయం కనిపించడం లేదు. ఇప్పటికీ అదే ధీమాతో ముందుకు వెళ్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్‌ను చూసి భయపడాల్సిన అవసరం లేదట. అంతేకాదు.. ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవకపోయినా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటోంది.
జగన్ ఈ రిజల్ట్ చూసి అంతా తన ఇమేజ్ అని, సంక్షేమ పథకాల ప్రభావం అన్న భ్రమల్లో ఉండటమే మేలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో మరే ఎన్నికలు ఉండవు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా అది అధికార వైసీపీకే అనుకూలంగా ఉంటుంది. అయినా.. చంద్రబాబులో ధీమా తగ్గలేదు. గతంలో చంద్రబాబు కూడా నంద్యాల ఉప ఎన్నిక రిజల్ట్ చూసి భ్రమించారు. ఆ తర్వాత కాకినాడ కార్పొరేషన్ ను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో నంద్యాల ఫార్ములా అంటూ చంద్రబాబు అప్పట్లో ఊదరగొట్టేశారు. కానీ.. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే చంద్రబాబుకు సినిమానే కనిపించింది.
అయితే.. ఇదే పరిస్థితి జగన్‌కు కూడా భవిష్యత్‌లో రాకతప్పదని టీడీపీ నేతలు ఆలోచనలో ఉన్నారు. అందుకే చంద్రబాబు తనపై కేసులు పెట్టినా పెద్దగా యాగీ చేయలేదు. సింపుల్‌గా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. పైగా అనేక చోట్ల బెదిరింపులు చేసి నామినేషన్లు వేయించలేదు. అలాగే పథకాలను నిలిపేస్తామని బెదిరింపులకు సైతం గురిచేశారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ నేతలు ఎక్కువ చోట్ల విజయం సాధించలేకపోయారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. టీడీపీ ఓటు బ్యాంకుకు ఏపీలో ఇప్పట్లో వచ్చిన ఢోకా ఏమీ లేదని చంద్రబాబు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సీఐడీ కేసు తనపై నమోదైనా చంద్రబాబు వెంటనే మీడియా ముందుకు రాలేదు. పార్టీ నేతలు, శ్రేణులే చంద్రబాబు కేసుపై స్పందించాయి. ఇలా జగన్ అనుసరిస్తున్న విధానాలతోనే తిరిగి తమకు పట్టు దొరుకుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా రానున్న రోజులన్నీ తమకు అనుకూలంగానే ఉంటాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. మరి ఫ్యూచర్ మాత్రం ఎవరి చేతిలో ఉంది. కాలం ఎలా నడిపిస్తే అలా వెళ్లాలి కదా. ఏం జరుగుతుందో చూద్దాం.