Pawan Kalyan: పవన్ పోటీ చేసే నియోజకవర్గం పై ఫుల్ క్లారిటీ వచ్చింది. అందుకు టిడిపి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తీవ్ర తర్జనభర్జన నడుమ పవన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఉండటంతో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే.. సీట్ల దగ్గర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని.. అందుకే పవన్ ఒక చోటే పోటీ చేయాలని దాదాపు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాను పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో చంద్రబాబుతో పవన్ చర్చించారని.. అందుకు ఆయన సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో పవన్ గాజువాక తో పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓటమి చవిచూశారు. అయితే ఈసారి ఒకే నియోజకవర్గాన్ని ఎంచుకొని పోటీలో దిగాలని పవన్ భావిస్తున్నారు. భీమవరం నియోజకవర్గం అయితేనే సునాయాసంగా విజయం దక్కుతుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ గెలుపొందారు. త్రిముఖ పోటీ ఉండడం వల్లే ఆయన గెలుపు సాధ్యమైంది. గ్రంధి శ్రీనివాస్ కు 70, 642 ఓట్లు, పవన్ కు 62,285 ఓట్లు, టిడిపి అభ్యర్థి అంజిబాబుకు 54,037 ఓట్లు లభించాయి. ఈసారి పొత్తు కుదిరితే మాత్రం దాదాపు 50 వేలకు పైగా మెజారిటీతో పవన్ గెలిచే అవకాశం ఉందని నివేదికలు వచ్చాయి. అందుకే పవన్ భీమవరం నుంచి పోటీ చేయడానికి దాదాపు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా తన పోటీ చేయబోయే నియోజకవర్గంపై పవన్ సర్వే చేయించుకున్నట్లు తెలుస్తోంది. సురక్షిత నియోజకవర్గం గురించి అన్వేషించారు. అదే సమయంలో సీఎం జగన్కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గ మాదిరిగా.. ఒక శాశ్వత ముద్ర వేసుకోవాలని పవన్ భావిస్తున్నారు. సొంత నియోజకవర్గాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. అందుకు భీమవరం అయితేనే సరైన నియోజకవర్గంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలపై రకరకాల ప్రచారాలు జరిగాయి. గాజువాక, విశాఖ ఉత్తర, తిరుపతి, అనంతపురం, కాకినాడ రూరల్, పిఠాపురం తదితర నియోజకవర్గాలు అనుకూల జాబితాలో ఉన్నాయి. అయితే అన్నింటికీ మించి భీమవరం సేఫ్ జోన్ అని సర్వే నివేదికలు తేల్చినట్లు సమాచారం. అందుకే పవన్ సైతం తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై చంద్రబాబుకు ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు సైతం అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు భీమవరం నియోజకవర్గం పక్కాగా పవన్ పోటీ చేస్తారని ఆ నియోజకవర్గ టిడిపి, జనసేన శ్రేణులకు సైతం ఒక సమాచారం తెలిసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రెండు పార్టీల సమన్వయ కమిటీల సమావేశాలు జరుగుతున్నాయి. విదేశాలనుంచి వచ్చిన పవన్ నేరుగా చంద్రబాబును పరామర్శించారు. రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో రెండు పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు విషయంలో ఏం చేయాలి అన్నది చర్చించినట్లు సమాచారం. కానీ నిర్దిష్టమైన సీట్లు గురించి, జనసేన కేటాయించే స్థానాలు గురించి చర్చలు తర్వాత చేయనున్నట్లు సమాచారం. ఈనెల 7న 2 పార్టీల నేతల మధ్య సమన్వయ సమావేశం జరగనుంది. చంద్రబాబు కేసులు కొలిక్కి వచ్చిన తర్వాత జనసేనకు కేటాయించే సీట్లపై స్పష్టతనిస్తారని సమాచారం. అటు తెలంగాణ ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడి కానున్న నేపథ్యంలో.. ఏపీలో బిజెపి పాత్ర ఏమిటి అన్న విషయం కూడా తెలియనుంది. అటు తరువాతే జనసేన సీట్లపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.