Telangana Elections 2023: తెలంగాణ రాజకీయాల శరవేగంగా మారుతున్నాయి. పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానంగా జనసేన బిజెపితో జత కలవడంతో తెలంగాణలో కొత్త రాజకీయం మొదలైంది. కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్య హోరాహోరి ఫైట్ నడుస్తోందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మధ్యలో జనసేన బిజెపికి తోడు కావడంతో.. ఆ కూటమి పై చేయి సాధిస్తుందా? లేదా? అన్నది చూడాలి. ముఖ్యంగా సెటిలర్స్ ఓట్ల విషయంలో పెద్ద రాజకీయమే నడుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ టీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో సెటిలర్స్ ఓట్లు ఎవరికి పడతాయని చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రమూలాలు ఉన్న జనసేన బిజెపితో జత కట్టడం, జనసేన టిడిపి మిత్రపక్షం కావడం, ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన సెటిలర్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వంటివి అయోమయం, గందరగోళానికి కారణమవుతున్నాయి. అయితే పోటీ నుంచి తప్పుకోవడం ద్వారా తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయమని చంద్రబాబు కోరుతారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సెటిలర్ల ఓట్లు ఎవరికి దక్కుతాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, బిజెపితో జనసేన పొత్తు వంటి కారణాలు సెటిలర్స్ పై విపరీతంగా ప్రభావం చూపుతున్నాయి.
జనసేన ఇప్పటికే 32 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కానీ జనసేనకు బిజెపి కేవలం 9 స్థానాలనే ఇవ్వాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో సీట్ల కేటాయింపునకు మొగ్గు చూపింది. హైదరాబాద్ తో పాటుగా ఖమ్మం , నిజామాబాద్ జిల్లాల్లో సెటిలర్స్ ప్రభావం అధికం. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో సెటిలర్లు గెలుపోవటములను నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లో సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. వీరిని ఆకట్టుకోవడానికి ప్రధాన మూడు పార్టీలు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతున్నాయి. టిడిపి పోటీలో లేకపోవడం, జనసేన బరిలో దిగడం వంటి కారణాలతో కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ లకు ఏపీ ముఖ్యం. అక్కడ వైసీపీని ఎదుర్కోవాలంటే కేంద్రం మద్దతు అవసరం. అందుకే తన అరెస్టు తర్వాత తెలంగాణ ఎన్నికల నుంచి చంద్రబాబు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అదే సమయంలో టిడిపి క్యాడర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోంది. అటు మిత్రపక్షమైన జనసేన బిజెపితో జత కలిసింది. అయితే ఇదంతా ముందస్తు వ్యూహంతో చేసినదా అన్న చర్చ మొదలైంది. జనసేన ను బిజెపి వైపు పంపించి.. ఇటు కాంగ్రెస్ వైపు టిడిపి క్యాడర్ సానుకూలత చూపించడం విశేషం. ఇక్కడే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఉపయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతిమంగా బిఆర్ఎస్ ను దెబ్బతీయడానికి ఈ ప్లాన్ అన్నట్లు ఉంది. అటు కాంగ్రెస్కు మేలు జరిగినా రేవంత్ రూపంలో నమ్మదగిన అనుచరుడు ఉన్నాడు. ఇటు బిజెపికి లభించినా ఏపీలో ప్రయోజనకారిగా మారుతుందని చంద్రబాబు నమ్మకం. మొత్తానికైతే తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్స్ ను టార్గెట్ చేసుకునే రాజకీయాలు నడుస్తుండడం విశేషం.