MVV Satyanarayana: ఏపీ నుంచి హైదరాబాద్ కు వ్యాపారాలు షిఫ్ట్.. అసలేం జరుగుతోంది?

మూడు దశాబ్దాల కిందట విశాఖ వచ్చిన ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగి నంబర్ వన్ బిల్డర్ గా గుర్తింపు సాధించారు.

Written By: Dharma, Updated On : June 20, 2023 9:47 am

MVV Satyanarayana

Follow us on

MVV Satyanarayana: పరిశ్రమల స్థాపనకు ఏపీ అనుకూలమైనా.. ఇక్కడ అందుకు తగ్గ సానుకూల వాతావరణం లేదన్న విమర్శ ఉంది. ప్రభుత్వంతో పాటు వైసీపీ నేతల చర్యలే అందుకు కారణమన్న టాక్ ఉంది. కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి కూడా ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతుండడంతో ఈ విమర్శ నిజమనేని ప్రజల్లో బలంగా ఉంది. ఇటువంటి తరుణంలో తాను ఏపీలో వ్యాపారం చేయలేనంటూ మరో పారిశ్రామికవేత్త ప్రకటించారు. ఆయన నంబర్ వన్ బిల్డరే కాదు. వైసీపీ స్వయాన ఎంపీ. విశాఖ లోక్ సభ సభ్యుడైన ఎంవీవీ సత్యనారాయణ తానిక ఏపీ ప్రాజెక్టులేవీ చేపట్టనని.. హైదరాబాద్ వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు.

మూడు దశాబ్దాల కిందట విశాఖ వచ్చిన ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగి నంబర్ వన్ బిల్డర్ గా గుర్తింపు సాధించారు. జగన్ పాదయాత్ర సమయంలో కీ రోల్ ప్లే చేశారు. ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటును సొంతం చేసుకున్నారు. త్రిముఖ పోటీలో తక్కువ మెజార్టీతో గట్టెక్కారు. గత నాలుగేళ్లుగా ఎంపీగా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గత ఏడాదిగా అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి రూపంలో అప్పట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇటీవలే ఎంపీ కుటుంబం,ఆయన వ్యక్తిగత ఆడిటర్ కిడ్నాప్ నకు గురయ్యారు. వారిని అపహరించిన రెండు రోజుల తరువాత విషయం బయటపడింది. అయితే గత నాలుగు రోజులుగా ఇది డబ్బు కోసం చేసిన వ్యవహారంగా ఎంపీ చెబుతూ వస్తున్నారు. కానీ తెర వెనుక మాత్రం భూ వివాదం, సెటిల్మెంట్ లో భాగంగానే కిడ్నాప్ కలకలం అని చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎంపీ మరో బాంబు పేల్చారు. తాను విశాఖలో వ్యాపారాలు మానుకుంటానని.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి హైదరాబాద్ వెళ్లనున్నట్టు స్వయంగా మీడియాకు వెల్లడించారు.

కొద్దిరోజుల కిందటే తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో పది వేల కోట్ల పెట్టుబడులతో వారు తెలంగాణ వైపు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ వంతు వైసీపీ ఎంపీకి వచ్చింది. ఏపీలో ప్రముఖ బిల్డర్ గా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ సైతం హైదరాబాద్ వెళ్లనున్నట్టు ప్రకటించడంతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగాలకు ఏ స్థాయిలో వేధింపులు ఎదురవుతున్నాయో అర్ధం అవుతోంది. లోపం ఎక్కడుందో ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. తమ వద్దే ఉంటే సరిదిద్దుకోవాలి. లేకుంటే ఏపీలో ఒక్క పారిశ్రామికవేత్త సైతం నిలబడే చాన్స్ ఉండదన్న విషయం తెలుసుకోవాలి.