Patna : ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళ సంఖ్య తగ్గిపోవడం.. ఉన్నవారికి డిమాండ్ పెరిగిపోవడంతో.. పెళ్ళికాని యువకుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో వారందరినీ పెళ్లికాని ప్రసాదులు అని పిలుస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం తాపత్రయ పడటం.. మంచి ఉద్యోగ సాధించడానికి వెంపర్లాడటం.. వీటిని సాధించే ప్రక్రియలో చాలామందికి సరైన వయసులో పెళ్లి కావడం లేదు. దీంతో వారంతా కూడా పెళ్లికాని ప్రసాద్ లుగా మిగిలిపోతున్నారు.. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఓ గ్రామంలో 80 సంవత్సరాల నిండిన పెళ్లికాని ప్రసాదులు చాలామంది ఉన్నారు.. దీంతో ఆ గ్రామంలో తర్వాతి తరం అనేది పుట్టలేదు. ఉన్న యువకులు కూడా పెళ్లిళ్లు కాకపోవడంతో.. ఒంటరిగా మిగిలిపోతున్నారు. నిసారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉందంటే.. అలా ఎందుకు జరుగుతుందంటే.. దీనికి దేవుడు శాపం లేదు. దాని వెనుక ఒక కారణం ఉంది. ఆ కారణమే వారి జీవితాలను బ్రహ్మచారులుగా మిగిల్చింది.
బీహార్ రాష్ట్రం (Bihar state) రాజధాని పాట్నా (Patna) కు 300 కిలోమీటర్ల దూరంలో కైమూర్ అనే పేరుతో ఓ జిల్లా ఉంది.. ఈ జిల్లాలో బర్వన్ కాలా(burbankala) అనే ఓ గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని “బ్రహ్మచారుల ఊరు” అని పిలుస్తారు. ఈ గ్రామంలో గత 50 సంవత్సరాలుగా పెళ్లి భజంత్రీలు మోగలేదు. అలాగని ఆ గ్రామంలో వింత ఆచారాలు లేవు. ఊరికి కట్టుబాట్లు కూడా లేవు. అసలు విషయం ఏంటంటే ఈ ఊర్లో మగ పిల్లలకు ఆడపిల్లలను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందువల్లే ఇక్కడ మగ పిల్లలకు వివాహాలు జరగడం లేదు. ఈ గ్రామంలో సరైన రహదారి లేదు. విద్యుత్ సౌకర్యం లేదు కూడా లేదు. నీరు సరఫరా ఏది అంతంత మాత్రమే.. అందువల్లే ఈ గ్రామంలో అబ్బాయిలకు ఆడపిల్లలను ఇవ్వడానికి తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. అయితే 2017లో ఓ వధువు ఈ గ్రామంలో అడుగుపెట్టింది. అయితే నాడు ఆమెను తమ గ్రామంలోకి ఆహ్వానించడానికి ప్రజలు భారీగా హాజరయ్యారు. ఆమెపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు..” మా గ్రామం పాట్న రాజధానికి చాలా దూరంలో ఉంటుంది. దురదృష్టానికి దగ్గరగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా మా గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు విన్నవించాం. ప్రజా ప్రతినిధులకు సూచించాం. అయినప్పటికీ మా గ్రామంలో వెలుగు రేఖలు ప్రసరించలేదు. ఇకపై ప్రసరిస్తాయని నమ్మకం కూడా లేదు. మా గ్రామం అభివృద్ధికి దూరంగా ఉండడం మా జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పటికే మాకు పెళ్లి చేసుకునే వయసు దాటిపోయింది. వచ్చే తరం ఇక్కడ అభివృద్ధి చెందాలంటే.. కచ్చితంగా గ్రామం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. రోడ్లు నిర్మించాలి. విద్యుత్ సౌకర్యం కల్పించాలి. తాగునీటిని నిరంతరం అందించాలి. అప్పుడే ఈ గ్రామం చరిత్రలో ఉంటుందని” ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.