Phone Tapping Case: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంచలనం సృష్టించిన కేసు ఫోన్ ట్యాపింగ్. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలతోపాటు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసింది. ప్రభుత్వం ఓడిపోవడంతో రికార్డు చేసిన హార్డ డిస్క్(Hard disk)లను ధ్వసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పది నెలలుగా విచారణ జరుపుతున్నారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్(Phone tapping)కేసు గతేడాది సంచలనం రేసింది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షనేతలతోపాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖుల, సినీ నటుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నతోపాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసుపై బెయిల్ కోసం నిందితులు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ఎట్టకేలకు తిరుపతన్నకు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు 10 నెలలుగా జైల్లో ఉన్నాడని, ఇక ఉండాల్సిన పని లేదని వ్యాఖ్యానించింది. ట్రయల్‌కు తిరుపత్న పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ప్రయత్నించొద్దని సూచించింది. సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చెరిపే ప్రయత్నం చేసినా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దు కోరవచని తెలిపింది. పాస్‌పోర్టు రద్దు సహా ఇతర బెయిల్ షరతులు ట్రయల్ కోర్టు పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
వ్యతిరేకించిన ప్రభుత్వం..
తిరుపతన్న బెయిల్ పటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ప్రభుత్వం తరఫున లూథ్రా వాదనలు వినిపించారు. కొంతమంది కీలక సాక్షులను ఇంకా విచారణ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో తిరుపతన్నకు బెయిల్ ఇవ్వకూడదని కోరారు.
జడ్జీల ఫోన్లు ట్యాప్..
రాజకీయ నేతల ఆదేశాలతో తిరుపతన్న హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఆధారాలు చెరిపేయడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆధారాలన్నీ ధ్వంసం చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతన్న పాస్‌పోర్టును వెంటనే సరెండర్ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. కేసులో కీలకమైన ఇద్దరు నిందితులు ఇప్పటికే విదేశాలకు పారిపోయారని న్యాయవాధి లూథ్రా తెలిపారు.
మొదటి వ్యక్తి తిరుపతన్నే..
ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదట అరెస్ట్ అయిన వ్యక్తి తిరుపతన్నే. ఈ కేసులో నలుగురిని గతేడాది హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అడిషనల్ ఎస్పీ ప్రణీత్‌రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు పది నెలలుగా వీరు జైల్లోనే ఉన్నారు. బయటకు వచ్చేందుకు అనేకసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా రిజెక్ట్ అయ్యాయి. హైకోర్టులో ఊరట లభించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు తిరుపతన్న. ఆయనకు ఎట్టకేలకు ఊరట లభించింది. బెయిల్ మంజూరైంది.