Sonia Gandhi Birthday- BRS: డిసెంబర్ 9.. ఈ తేదీకి తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం ఉంది. అందరూ ఈ తేదీని మిగతా తేదీల్లా భావిస్తారు. కానీ డిసెంబర్ 9 తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మరో మలుపు తిప్పడానికి కారణమైంది. మరోవైపు ఇదే తేదీ.. కాంగ్రెస్ పార్టీకి అత్యంత ముఖ్యమైంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు కూడా ఇదే. ఇప్పుడు ఇదే డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ముఖ్యమంత్రికి కీలకంగా మారింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆయన టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చాలని నిర్ణయించారు. ఈమేరకు సుముఖత తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 8న కేసీఆర్‌కు లేఖ పంపింది. డిసెంబర్ 9 ముహూర్తం బాగుండడంతో మధ్యాహ్నం 1:20 గంటలకు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. కాకతాళీయమే అయినా.. డిసెంబర్ 9కి తెలంగాణలో మరోమారు ప్రాధాన్యం దక్కింది.

తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు..
తెలంగాణ మలిదశ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న క్రమంలో తెలంగాణ ఉద్యమ సారధిగా ఉన్న కేసీఆర్ నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో నినాదంతో ఆమరణ దీక్ష చేపట్టారు. దీంతో మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. దీంతో నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏలో కదలిక వచ్చింది. యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియాగాంధీ నాటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్, కేంద్ర మంత్రులు, తెలంగాణ, ఆంధ్రాప్రాంత కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారు. అనేక సమావేశాల తర్వాత సోనియాగాంధీ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9, యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనతో తెలంగాణలో సంబురాలు జరుగగా, ఆంధ్రాలో ఆందోళనలు మొదలయ్యాయి. రాష్ట్రాన్ని విభజించొద్దని సమైక్యవాదులు ఉద్యమించారు. దీంతో ఆంధ్రాప్రాంత నేతల ఒత్తడికి తలొగ్గిన కేంద్రం తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకుంది.
కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని.. కాంగ్రెస్‌కు దీటుగా..
తెలంగాణ ప్రకటన ఉపసంహరణ తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం మరింత ఉధృతమైంది. ఈ క్రమంలో ఢిల్లీలో నాడు లాబీయింగ్ జరిపిన కేసీఆర్ అనేక పార్టీలు తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చేలా ఒప్పించగలిగారు. చివరకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో సమావేశమై ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, ఆవశ్యకతను తెలియజేశారు. టీఆర్‌ఎస్ పార్టీ పుట్టింది ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసమే అని అది నెరవేరితే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని సోనియాగాంధీకి హామీ కూడా ఇచ్చారు. ఆతర్వాత ప్రత్యేక కమిటీలు, చర్చలు, సంప్రదింపుల తర్వాత కేంద్రం పార్లమెంటలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆ మరుసటి రోజే కేసీఆర్ తన కుటుంబంతో కలిసి టెన్ జన్‌పత్‌లోని సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని అంతా భావించారు. కానీ, కేసీఆర్ ఇక్కడే తన రాజకీయ చతురత ప్రదర్శించారు. విలీనం మాట ఉపసంహరించుకుని ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ను రాజకీయ పార్టీగా మార్చారు. రాజకీయాలు మొదలు పెట్టారు.

కాంగ్రెస్ పతనానికి బాటలు..
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానన్న కేసీఆర్ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. తర్వాత పరిణామాలతో కాంగ్రెస్ పతనానికి బాటలు వేశారు. 2018 ఎన్నికల్లో రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో కాంగ్రెస్ పతనాన్ని శాసించారు. తెలంగాణ కోసం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా జాతీయ రాజకీయాల్లోనే ఉండాలనుకున్నారు. కానీ తెలంగాణ ఓటర్లు ఉద్యమసారథిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కే అవకాశం ఇచ్చారు. 2018లో రెండోసారి గెలిపించారు.
మళ్లీ జాతీయ రాజకీయాలపై దృష్టి..
రెండు పర్యాయాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ దృష్టి మళ్లీ జాతీయ రాజకీయాలపైకి మళ్లింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నించారు. కానీ ఎవరూ ఆయనతో కలిసి రాలేదు. దీంతో టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చాలనుకున్నారు. ఈమేరకు అక్టోబర్ 5న బీఆర్‌ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేశారు. తాజాగా సోనియాగాంధీ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9వ తేదీనే ఈ క్రమంలో కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సిన టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా అధికారికంగా మార్చారు. ఇక నుంచి ఏటా డిసెంబర్ 9న బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు గులాబీ శ్రేణులు.