
YCP Govt: ఓవైపు రాష్ట్రంలో కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. భారీ పరిశ్రమలు పలాయనం చిత్తగిస్తున్నాయి. సరైన పారిశ్రామిక విధానం లేదు. ఒకవేళ కొత్త పరిశ్రమలు వచ్చిన వాటి ఉత్పత్తులను కొనుగోలు చేసే శక్తి ప్రజల్లో ప్రస్తుతం ఉందా?. నేల చూపులు చూస్తున్న ఉద్యోగిత రేటు పెరుగుతుందా?. నాయకులకు కమిషన్లు ఇచ్చి రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పగలరా? తదితర ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి.
నేటి నుంచి విశాఖలో రెండు రోజులపాటు గ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమవుతుంది. జాతీయ అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్నారని, దాదాపుగా రెండు లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేసాయని వైసీపీ నేతలు గత కొన్ని రోజులుగా ఊదరగొడుతున్నారు. సాధారణంగా ఒక పరిశ్రమను స్థాపించాలంటే అక్కడ ప్రజల జీవన స్థితిగతులు, కొనుగోలు శక్తి, ప్రభుత్వ విధానాలు, పర్యావరణం తదితర అంశాలను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి దాదాపుగా ఆశించినంత మేర లేదు. ధరలు పెరిగిపోయి ప్రజలు అల్లాడిపోతున్నారు. ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంటోంది. వ్యాపారాలు లేక ఉద్యోగస్తులకు జీతాలు సరైన సమయంలో రాక ఊసురోమంటున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమలు ఉత్పత్తులు చేస్తే వాటిని రవాణా చేసేందుకు ముఖ్యంగా రోడ్లు, పోర్టులు అవసరం. మన రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి నాలుగేళ్ల నుంచి చాలా అధ్వానంగా ఉంది. విశాఖలోని పోర్టులో ఆశించినంత మేర ఎగుమతులు దిగుమతులు లేవు. కొత్త పోర్టులు ఇంకా ప్రతిపాదన, నిర్మాణ దశలోనే ఉన్నాయి. దుగరాజపట్నం లేదా రామాయపట్నంలో కేంద్రం ఒక భారీ పోర్టు నిర్మించాల్సి ఉంది. కడపలో ఉక్కు కర్మాగారం నెలకొల్పాల్సి ఉంది. వీటన్నింటిని కేంద్రం, రాష్ట్రం పెంచి పోషిస్తున్న కంపెనీలకు అప్పగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్ ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అదానీకో, అంబానీకో అప్పజెప్పేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కొత్త పెట్టుబడిదారులు వచ్చిన ఎంతవరకు ఇమడగలరనేది ప్రధానమైన ప్రశ్న.

మరోవైపు రాయలసీమలో సోలార్ ప్లాంట్ పేరుతో అదానీకి 400 ఎకరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అక్కడ భూములిచ్చిన రైతులకు పరిహారం పూర్తిగా అందలేదు. వాళ్లు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. అవేమి లెక్కచేయని అదానీ కంపెనీ ముందుగానే అక్కడ వాలిపోయి పనులను ప్రారంభించింది. సోలార్ ప్యానల్స్ ను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని పనులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత వాళ్లు చెప్పిన ధరకు విద్యుత్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తారు. ఇటువంటి బూటకపు కంపెనీలతో భవిష్యత్తులో ప్రమాదకరం. అంతిమంగా విద్యుత్ భారం ప్రజలు మోయాల్సిందే.
ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా నిరోధిచబడ్డాయనేది గమనించదగ్గ విషయం. మరి ఈ గ్లోబల్ సమ్మిట్ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నహడావుడి దేనికోసమని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నీతి మహేశ్వరావు ప్రశ్నిస్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి భయానక వాతావరణం నెలకొని ఉంది. అమర రాజా ఫ్యాక్టరీస్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా వేరే రాష్ట్రానికి తరలి వెళ్లాయి. రాష్ట్రం ఆర్థిక దివాలా అంచున ఉంది. బడ్జెట్లో కూడా పారిశ్రామిక విధానానికి కేటాయించింది 2000 కోట్లు మాత్రమే. ఇటువంటిది పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారో అర్థం కాని పరిస్థితి. రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ ముగిసిన తర్వాత వైసిపి నాయకులు ఇక రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేశాయని ఊదరగొట్టి రాష్ట్రం ఇక అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతుందని రాబోవు ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లేందుకు ఒక ఎత్తుగడగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచకుండా పరిశ్రమల వస్తున్నాయని పెట్టుబడుల వరద పారబోతోందని నమ్మించడానికి ప్రజలేమి పిచ్చోళ్లేం కాదు.