Israel Palestine War: ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య యుద్ధం.. ప్రపంచంపై పడే భారీ ఎఫెక్ట్ ఇదీ

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా అనూహ్యంగా పెరుగుతున్నాయి. బ్రెంట్‌ రకం క్రూడాయిల్‌ బ్యారల్‌ ధర 4.89 డాలర్లు (5.7 శాతం) ఎగబాకి 90.89 డాలర్లకు చేరుకుంది.

Written By: Bhaskar, Updated On : October 16, 2023 12:33 pm
Follow us on

Israel Palestine War: గత ఏడాది రష్యా_ ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం వల్ల అనేక పరిణామాలు సంభవించాయి. బంగారం ధర పెరిగింది. ఇంధనం ధర కొండెక్కింది. ఇప్పుడు ఇజ్రాయిల్_ పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆ ప్రభావం బంగారం, ముడి చమురు ధరలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. రోజుల వ్యవధిలోనే బంగారం, ఇంధనం ధరలు పెరగడం ప్రపంచ మార్కెట్ వర్గాలను నివ్వెర పరుస్తున్నాయి. ముఖ్యంగా విలువైన లోహాల ధరలు మళ్లీ కొండెక్కుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.. బంగారం మళ్లీ రూ.60,000 ఎగువకు చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ స్పాట్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర గత శనివారం రూ.1,520 పెరిగి రూ.60,440కి ఎగబాకింది. 22 క్యారెట్ల లోహం రేటు రూ.1,390 పెరుగుదలతో రూ.55,400 పలికింది. కాగా, కిలో వెండి సైతం రూ.2,000 మేర ప్రియమై రూ.77,000గా నమోదైంది. ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య యుద్ధం భీకర రూపం దాలుస్తుండటం ఇందుకు కారణమైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారం, వెండికి అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు 62.90 డాలర్లు (3.34 శాతం) పెరిగి 1,945.90 డాలర్లకు చేరుకోగా.. వెండి 22.90 డాలర్లకు చేరుకుంది. ఈ వారంలో ఔన్స్‌ గోల్డ్‌ 5 శాతానికి పైగా పెరిగింది. ఈ వారం ప్రారంభంలో 1,850 డాలర్ల స్థాయిలో టేడైన బంగారం.. వారాంతాని కల్లా 1950 డాలర్లకు పరుగు తీసింది. ఈ యుద్ధ ప్రభావంతో మున్ముందు బంగారం 2,000 డాలర్లు దాటవచ్చని బులియన్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం గోల్డ్‌ 1,968 డాలర్ల వద్ద నిరోధం కన్పిస్తున్నదని, ఆ స్థాయిని అధిగమిస్తే 2,000 డాలర్ల దిశగా పరుగు తీయడం పక్కా అని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. అదే గనక జరిగితే, దేశీయంగా 10 గ్రాముల పసిడి 62,000 దాటవచ్చు. ప్రస్తుతం దేశంలో పండగ సీజన్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో ధరలు ఒక్కసారిగా ఎగబాకడం, వచ్చే వారంలో మరింత పెరిగే అవకాశాలుండటం నగల కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని వర్తకులు వాపోతున్నారు.

ముడి చమురు ధరలు కూడా..

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా అనూహ్యంగా పెరుగుతున్నాయి. బ్రెంట్‌ రకం క్రూడాయిల్‌ బ్యారల్‌ ధర 4.89 డాలర్లు (5.7 శాతం) ఎగబాకి 90.89 డాలర్లకు చేరుకుంది. అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియేట్‌ (డబ్ల్యూటీఐ) క్రూడ్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ రేటు సైతం 5.8 శాతం పెరిగి 87.7 డాలర్లు పలికింది. ఈ ఏప్రిల్‌ 3 తర్వాత డబ్ల్యూటీఐ క్రూడాయిల్‌ రేటుకు ఇదే అతిపెద్ద పెరుగుదల. బ్రెంట్‌ ముడిచమురు ఈ వారంలో 7.5 శాతం పెరిగింది. ఫిబ్రవరి తర్వాత ధర ఈ స్థాయిలో పెరగటం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం మధ్యప్రాచ్యంలోని చమురు ఉత్పత్తి దేశాలకూ విస్తరించవచ్చన్న భయాలతో పాటు రష్యా ముడి చమురును సరఫరా చేసే ఆయిల్‌ ట్యాంకర్‌ యజమానులపైనా ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం క్రితం సెషన్‌లో రేట్లు భారీగా పెరగడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు.ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య జరుగుతున్న పోరుతో ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ఎలాంటి ప్రభావం లేదు. కానీ, చమురు ఉత్పత్తి దేశాలైన ఇరాన్‌, లెబనాన్‌లోని హెజ్బుల్లా గ్రూప్‌, సిరియా పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు పలుకుతుండటంతో మున్ముందు యుద్ధం ఇతర ప్రాంతాలకూ విస్తరించవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే గనక జరిగితే, చమురు ఉత్పత్తి, సరఫరాపై ప్రభావం పడవచ్చని, బ్యారల్‌ ధర 100 డాలర్లకు ఎగబాకవచ్చన్న అంచనాలున్నాయి.

క్యాడ్‌ మళ్లీ కట్టు తప్పేనా..?

ముడి చమురు దిగుమతుల భారంతో కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌) మళ్లీ కట్టుతప్పే అవకాశాలున్నాయి. ఎందుకంటే, బ్రెంట్‌ క్రూడ్‌ ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదల.. క్యాడ్‌ను 0.5 శాతం మేర పెంచనుంది. ఎగుమతుల ద్వారా లభించే ఆదాయం కన్నా దిగుమతుల కోసం వ్యయం అధికంగా ఉండే పరిస్థితిని కరెంట్‌ ఖాతా లోటు అంటారు. ఇక, ఈ ఏడాది మే-జూలైలో 80 డాలర్ల దిగువన ట్రేడైన బ్రెండ్‌ ముడి చమురు.. ఆ తర్వాత క్రమంగా ఎగబాకుతూ వచ్చింది. గత నెలాఖరులో 97 డాలర్ల వరకు ఎగబాకింది. గడిచిన కొన్ని రోజుల్లో కాస్త దిగివచ్చినప్పటికీ, తాజా భయాలతో మళ్లీ 90 డాలర్లకు చేరుకుంది. ఇది భారత్‌పై ముడి చమురు దిగుమతుల భారాన్ని గణనీయంగా పెంచనుంది. ఎందుకంటే, దేశీయ ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి క్రూడ్‌ దిగుమతుల సగటు రేటు 78.19 డాలర్ల నుంచి ఇప్పటికే 87.67 డాలర్లకు పెరిగింది. అయినప్పటికీ, మన ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ వరుసగా 18 నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇప్పటివరకు రష్యా నుంచి చౌకగా ఇంధనం కొనుగోలు చేసిన భారత్‌కు.. అమెరికా తాజా ఆంక్షలు ఇందుకు ప్రతిబంధకంగా మారే అవకాశాలున్నాయి. దిగుమతుల భారం మరింత పెరిగిన పక్షంలో, ఇంధన విక్రయ సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను కూడా పెంచాల్సి రావచ్చు. కానీ, ఎన్నికలు దగ్గర పడుతుండటం, ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ఠ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇందుకు అంగీకరించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో ఈ త్రైమాసికానికి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సి రావచ్చన్నారు. కొంత భారాన్ని ప్రభుత్వం భరించే అవకాశాల్లేకపోలేవన్నారు.

Tags