TRS MLA’s Son: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు వల్లే తాము ఆత్మహత్య చేసుకున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వనమా రాఘవేంద్రరావు కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. తాజాగా రాఘవేంద్రరావును కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా, ఈ ఘటనపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడా స్పందించారు. పాల్వంచ ఘటన తనను తీవ్ర క్షోభకు గురి చేసిందని ఈ సందర్భంగా తన లేఖలో పేర్కొన్నారు. తన కుమారుడిపై పోలీసుల విచారణకు సహకరిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

రాఘవేంద్రరావును పోలీసు విచారణకు అప్పగించేందుకుగాను రెడీగా ఉన్నట్లు వనమా వెంకటేశ్వరరావు లేఖలో తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు హైదరాబాద్‌లో రాఘవేంద్రరావును అరెస్టు చేశారు. ఇకపోతే తన భార్యను హైదరాబాద్‌కు పంపాలని అలా అయితేనే తన సమస్య ను పరిష్కరిస్తానని రాఘవేంద్రరావు అన్నాడని నాగ రామకృష్ణ ఆరోపణలు చేశారు. రాఘవేంద్రరావుపై కొత్తగూడెం పోలీసులు పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Also Read: ఈటలకు అలా.. ‘వనమా’కు ఇలా..కేసీఆర్ ది ధృతరాష్ట్ర తీరేనా?
హైదరాబాద్‌లో అరెస్టు చేసిన అనంతరం రాఘవేంద్రరావును కొత్తగూడెం తరలించినట్లు సమాచారం. బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధి కుమారుడు అయిన రాఘవేంద్రరావుపైన గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే కుమారుడిగా ఉండి వనమా రాఘవేంద్రరావు నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నాడని పలువురు ఆరోపించారు.
ఇకపోతే రాఘవేంద్రరావు వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారని, ఆయన్ను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య రాఘవేంద్రను శిక్షించాలని కోరుతున్నారు. పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. వనమా వెంకటేశ్వరరావు తనయుడిపైన గతంలోనూ చాలా ఆరోపణలు వెలుగు చూశాయి. సెటిల్మెంట్లు, భూవివాదాలు పరిష్కరించడంతో పాటు వ్యక్తిగత పంచాయితీలు చెప్పే క్రమంలో వనమా రాఘవేంద్రరావు అరాచకాలు చేశాడని పలువురు అంటున్నారు.
Also Read: అతను మొదటి నుంచి అలానే.. అరాచకాలకు కేరాఫ్ ఆ ఎమ్మెల్యే కొడుకు..!