Haryana Elections 2024: హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో బీజేపీలో ఆందోళన నెలకొనగా, హస్తం పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. మంగళవారం(అక్టోబర్ 8న)ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి గంటలో ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగానే వచ్చాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లో హస్తం పార్టీ దూకుడు ప్రదర్శించింది. హన్యానాలో కాంగ్రెస్ పార్టీ 60కిపైగా స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది. జమ్మూ కశ్మీర్‌లో 40కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కశ్మీర్‌లో ఫలితాలు రౌండ్ రౌండ్‌కు మారుతున్నాయి. దీంతో ఉత్కంఠ నెలకొంది.
అనూహ్యంగా బీజేపీ ఆధిక్యం..
కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటలు కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చాగా ఉదయం 10 గంటల తర్వాత అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. ఒక్కసారిగా కాంగ్రెస్ లీడ్ పడిపోయింది. ప్రస్తుతం బీజేపీ 44 స్థానాల్లో, కాంగ్రెస్ 40 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నాయి. అప్పటి వరకు హర్యానాలో అధికారంలోకి వస్తున్నామని సంబరాలు చేసుకున్న హస్తం నేతలు ఒక్కసారిగా డీలా పడ్డారు.
అసలు ఏం జరుగుతుంది..
ఇదిలా ఉంటే.. ట్రెండ్స్ ఒక్కసారిగా మారడంతో హర్యానాలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. హర్యానా ప్రజలు కమలం పార్టీకి అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం షాక్‌లో ఉన్నారు. మొదటి మూడు రౌండ్ల కౌంటింగ్‌లో 60 స్థానాలకుపైగా ఆధిక్యం కనబర్చిన కాంగ్రెస్ 4, 5 రౌంట్ లెక్కింపు తర్వాత డీలాపడింది.
పోటాపోటీ..
హర్యానాలో రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా ఫలితాలు తారుమారవుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఆధిక్యత తేడా స్వల్పంగానే ఉంది. దీంతో ఎన్నికల తర్వాత ఇతరులు, కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
90 స్థానాలు..
హర్యానాలో మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరిగాయి. 68 శాతం పోలింగ్ నమోదైంది. 93 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయంపై బీజేపీ ధీమాగా ఉండగా, ఎగ్జిట్ పోల్ ఫలితాల అంచనాతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది.