Narendra Modi : ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. మోదీ 3.0 కొలువుతీరేది అప్పుడే..

ప్రభుత్వ ఏర్పాటుకు 272 స్థానాలు కావలసి ఉంది. దానికంటే కూడా 21 స్థానాలు ఎన్డీఏ కూటమికి అదనంగా ఉన్నాయి. అందువల్లే నరేంద్ర మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు.

Written By: NARESH, Updated On : June 5, 2024 5:08 pm

Narendra Modi

Follow us on

Narendra Modi : 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకుంటే.. 240 మాత్రమే ప్రజలు ఇచ్చారు.. గత ఎన్నికల్లో 303 సీట్లు సొంతంగా గెలిస్తే.. ఈసారి దాదాపు 60 సీట్లు తగ్గాయి. అయినప్పటికీ బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. భాగస్వామ్య పక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడింది. త్వరలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. కూటమి ఆధ్వర్యంలో ఏర్పడే కేంద్ర ప్రభుత్వానికి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వ్యవహరించనున్నారు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే మోదీ ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు.. ఇండియా కూటమికి మెరుగైన స్థానాలే రావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.. ఈ క్రమంలో అనుమానాలకు చెక్ పెడుతూ కాబోయే ప్రధానమంత్రిని తానేనని నరేంద్ర మోదీ ఇండికేషన్లు ఇచ్చేశారు.

జాతీయ మీడియా వర్గాల కథనం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు సమాచారం. జూన్ 8న సాయంత్రం ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో(Modi oath taking ceremony) ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని కీలక నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని సమాచారం.

మంగళవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెల్లడి కావడం.. ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడంతో.. ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోదీ వేగంగా పావులు కదిపారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ చివరిసారిగా సమావేశమైంది. ప్రస్తుత లోక్ సభ ప్రజకు సిఫారసు చేసింది. బుధవారం సాయంత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. చర్చల అనంతరం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విన్నవిస్తూ.. ఎన్డీఏ పక్షాలతో నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలుస్తారని తెలుస్తోంది.

మరోవైపు చివరికి కేబినెట్ సమావేశం అనంతరం నరేంద్ర మోదీ తన మంత్రి మండలి తో కలిసి రాష్ట్రపతి భవన్ వెళ్లారు. ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను అందజేశారు. వెంటనే ఆమోదించిన రాష్ట్రపతి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకు పదవులలో కొనసాగాలని మోదీ బృందానికి సూచించారు.

అయితే ఈ ఎన్నికల్లో దాదాపు 99 స్థానాలలో విజయం సాధించిన కాంగ్రెస్.. రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తంగా చూస్తే ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు, కాంగ్రెస్ 233 స్థానాలు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 272 స్థానాలు కావలసి ఉంది. దానికంటే కూడా 21 స్థానాలు ఎన్డీఏ కూటమికి అదనంగా ఉన్నాయి. అందువల్లే నరేంద్ర మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు.