Narendra Modi : మోడీ 3.0 ఎలా ఉండబోతుంది.. ఎన్డీఏ ప్రభుత్వం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటుందా?

Narendra Modi ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ కూర్పు, ఇతర విషయాలు ఎలా ఉంటాయనేది బుధవారం నాటి భేటీలో తేలుతుందని ఎన్డీఏ కూటమి నాయకులు అంటున్నారు.

Written By: NARESH, Updated On : June 5, 2024 4:51 pm

Modi

Follow us on

Narendra Modi : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆశించినంత స్థాయిలో సీట్లు రాకపోయినప్పటికీ.. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీనైతే దక్కించుకుంది. దీంతో మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని, మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈసారి కూడా బలమైన నిర్ణయాలు తీసుకుంటామని మోడీ ప్రకటించారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో ఒకసారి పరిశీలిస్తే..

2014, 2019 ఎన్నికలలో బిజెపి దాదాపు సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మిత్రపక్షాలకు అవకాశం కల్పించినప్పటికీ… రెండు పర్యాయాలు ప్రభుత్వం పై మోడీకే విపరీతమైన పట్టు ఉండేది.. కానీ ఈసారి మెజారిటీకి అవసరమైన 272 సీట్లకు తక్కువ స్థానాలలో బిజెపి గెలుచుకోవడంతో.. ఆ పార్టీ తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్, ఏక్ నాథ్ షిండే, చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యంలో లోక్ జనశక్తి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మిత్ర పక్షాలకు దాదాపు 40 సీట్ల వరకు బలం ఉంది. ఈ 40 స్థానాలు కలిస్తే బిజెపి ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ప్రాంతీయ పార్టీ నాయకులు కీలకపాత్ర పోషిస్తారు.. ఏపీలో చంద్రబాబు నాయుడు, బీహార్ లో నితీష్ కుమార్ వంటి వారు అత్యంత క్రియాశీలకమవుతారు.. వీరు మాత్రమే కాకుండా ఇండియా కూటమిలో ఉన్న అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి వారు కూడా గణనీయమైన సీట్లను సాధించిన నేతలుగా ఉన్నారు.. అయితే వీరంతా ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి.. పైగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చర్చలేవీ జరగడం లేదు కాబట్టి.. ప్రస్తుతానికైతే ఎన్డీఏనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావించాలి.

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే.. “డబుల్ ఇంజన్ ప్రభుత్వం” అనే నినాదం మరుగున పడొచ్చు. భవిష్యత్తు కాలంలో మరిన్ని సవాళ్లు కూడా ఎదుర్కొనేందుకు ఆస్కారం ఉంది.. పాలనలో వికేంద్రీకరణకు అవకాశం ఉంది. సంస్కరణలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఆర్థిక సంస్కరణలు కూడా ఒక పరిమితి వరకే ఆగిపోతాయి. భూ సేకరణ, వ్యవసాయ చట్టాలు ప్రస్తుతానికైతే అటక మీద నుంచి కిందికి దిగి వచ్చే పరిస్థితి ఉండదు. వాస్తవానికి గతంలో బిజెపికి మెజారిటీ ఉన్నప్పటికీ వీటిని అమలు చేయడంలో చాలా ఇబ్బంది పడింది.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి సంస్కరణలను విజయవంతంగా అమలు చేసే అవకాశం మోడీకి ఉండదు. పైగా ప్రభుత్వంలో ఉన్న భాగస్వాముల మధ్య ఏకాభిప్రాయాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రైవేటీకరణ, పెట్టుబడులు ఉపసంహరణ వంటి వాటి విషయంలో త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ కూర్పు, ఇతర విషయాలు ఎలా ఉంటాయనేది బుధవారం నాటి భేటీలో తేలుతుందని ఎన్డీఏ కూటమి నాయకులు అంటున్నారు.