Mynampally Hanumanth Rao: తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు కూడా వచ్చాయి. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటయింది. శనివారం అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మాల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న తీరు మరో విధంగా ఉంది. ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని చెప్పే నేతలు.. ఓటర్లు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చిన తర్వాత సహనం కోల్పోతున్నారు. ముఖ్యంగా ఓడిపోయిన అభ్యర్థి తాలూకు అనుచరులు వీరంగం సృష్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
తు చూస్తామని బెదిరింపులు
మల్కాజ్ గిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదని కారణంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు. మెదక్ స్థానంలో ఆయన గెలిచినప్పటికీ.. మైనంపల్లి హనుమంతరావు తన సమీప ప్రత్యర్థి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక ఆనాటి నుంచి మైనంపల్లి హనుమంతరావు అనుచరులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అంతేకాదు మైనంపల్లి హనుమంతరావు ఓటమిని జీర్ణించుకోలేక వీరంగం సృష్టిస్తున్నారు. మల్కాజ్గిరి పరిధిలోని భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లు, వారి భర్తలకు, మాజీ కార్పొరేటర్లకు, నాయకులకు ఫోన్లు చేస్తున్నారు. ఈ కాల్స్ మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోన్ నుంచి వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అయోమయానికి గురవుతున్నారు. అయితే ఇదంతా కూడా మైనంపల్లి హనుమంతరావు అనుచరులు చేస్తున్నారని రాజశేఖర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు..
నిషేధిత యాప్ వాడుతున్నారు
అయితే మైనంపల్లి వర్గీయులు నిషేధిత యాప్ వాడుతూ.. ఫోన్ కాల్స్ లో తన పేరు వచ్చే విధంగా చేస్తున్నారని మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో తన తరఫున పనిచేసిన వారందరినీ టార్గెట్ చేసి బూతులు తిడుతున్నారని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని రాజశేఖర్ రెడ్డి వాపోతున్నారు. ఈ విషయం మీద మర్రి రాజశేఖర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ బెదిరింపు కాల్స్ పై రెండు ఫిర్యాదులు వచ్చాయని నేరేడుమెట్ సిఐ తెలిపారు. కాగా ఈ కాల్స్ లో మైనంపల్లి వర్గీయులు భారత రాష్ట్ర సమితి నాయకులను బండ బూతులతో తిడుతున్నారు. మా అన్నను ఓడిస్తారా, ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తున్నారు. కాగా ఈ బెదిరింపు కాల్స్ కు సంబంధించి ఆడియోలను మర్రి రాజశేఖర్ రెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.