Pawan Kalyan Varahi Yatra: ఏపీలో ఒకటే ఉత్కంఠ. పవన్ ఏం చెప్పబోతున్నారు? ఎలా ప్రసంగించనున్నారు? మరికొద్ది గంటల్లో మూడో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది. పవన్ జనం మధ్యకి రావడం కొత్త కాదు. ఆయన,సభలు సమావేశాలకు జనాలు రావడం అంతకంటే కొత్త కాదు. ఆయన ఎలా మాట్లాడుతారు అన్నదే కొత్తగా ఉంటుంది. తొలి విడత వారాహి యాత్రలో వ్యవస్థలో ఉన్న లోపాలపై మాట్లాడారు. రెండో విడత యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను, సీఎం జగన్ టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు మూడో విడత యాత్రలో ఏం మాట్లాడతారోనని జనసైనికులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలను ప్రభావితం చేసే నాయకుల్లో పవన్ ముందుంటారు. ఆయన ఏం మాట్లాడినా? ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ప్రజల్లోకి బలంగా చొచ్చుకొనివెళ్తాయి. అందుకే ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రపై హై టెన్షన్ నెలకొంది. ఏపీలో గత మూడు వారాలుగా రాజకీయ వేడి అయితే పెద్దగా కనిపించడం లేదు. మీడియా ఫోకస్ అంతా చంద్రబాబు అరెస్టుపైనే ఉంది. అటు వైసీపీ సైతం సంక్షేమ పథకాల బటన్ నొక్కుడు తప్పించి రాజకీయంగా ఎటువంటి కార్యక్రమం ఏది చేపట్టలేదు. తెలుగుదేశం పార్టీలో నైరాశ్యం నెలకొంది. అధినేత జైలులో ఉండడంతో ఆ పార్టీకి దిశా నిర్దేశం చేసేవారు లేకపోయారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డ నుంచి ప్రారంభంకానున్న వారాహి యాత్రపైనే అందరి దృష్టి పడింది.
చంద్రబాబును జైలులో పరామర్శించి వచ్చిన తర్వాత పవన్ పొత్తు ప్రకటన చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని తేల్చేశారు. అటు తరువాత జరుగుతున్న యాత్ర కావడంతో హై ఫీవర్ నెలకొని ఉంది. ఈ కీలక సమయంలో పవన్ ఏమి చెప్పబోతున్నారు అన్నది అందరిలోనూ ఒక రకమైన ఉత్కంఠ రేపుతోంది. చంద్రబాబు అరెస్టు మీద గర్జిస్తారా? వైసిపి పై విరుచుకుపడతారా? అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ వెనుక బిజెపి హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. బిజెపి అగ్ర నేతల అనుమతితోనే చంద్రబాబును అరెస్టు చేయగలిగారని టాక్ నడుస్తోంది. బిజెపిపై పడుతున్న అనుమానపు చూపులు పైన పవన్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. త్వరలో తాను ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలుస్తానని కూడా పవన్ ప్రకటించారు. దీనిపై కూడా స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు బిజెపి స్టాండ్ ఏమిటన్నది కూడా వారాహి యాత్రలో పవన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే మరో కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.