https://oktelugu.com/

India Vs Canada: ఆ విషయంలో సీరియస్ గానే.. భారత్ తో కయ్యానికి దిగుతున్న కెనడా అధ్యక్షుడు

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నప్పటికీ తాము ఆ దేశంతో సన్నిహిత సంబంధాలే కోరుకుంటున్నట్టు ట్రూడో వ్యాఖ్యానించారు. అయితే భారత విషయంలో తాము, తమ మిత్ర దేశాలు సీరియస్ గానే ఉంటాయని స్పష్టం చేశారు.

Written By:
  • Rocky
  • , Updated On : September 29, 2023 / 01:41 PM IST

    India Vs Canada

    Follow us on

    India Vs Canada: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడా మధ్య చెలరేగుతున్న ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. పైగా కెనడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇంకా వ్యవహారం మరింత కఠినంగా మారుతున్నది. అయితే కెనడా చేస్తున్న వ్యాఖ్యలను భారత్ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యధికారులను పరస్పరం బహిష్కరించుకున్నాయి. దిగుమతులకు సంబంధించిన వ్యవహారాలలోనూ ఆచితూచి నడుచుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య బిలియన్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. అయితే తాజాగా దౌత్య వివాదం వల్ల ప్రస్తుతం ఆ స్థాయిలో వ్యాపారం జరగడం లేదు. అయితే ఈ పరిణామాలు ఇలా ఉండగానే శుక్రవారం మాంట్రియల్ లో కెనడా ప్రధానమంత్రి ట్రూడో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

    ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నప్పటికీ తాము ఆ దేశంతో సన్నిహిత సంబంధాలే కోరుకుంటున్నట్టు ట్రూడో వ్యాఖ్యానించారు. అయితే భారత విషయంలో తాము, తమ మిత్ర దేశాలు సీరియస్ గానే ఉంటాయని స్పష్టం చేశారు. “ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం. గత ఏడాది ఇది దేశాల మధ్య ఇండో, పసిఫిక్ ఉమ్మడి వ్యూహం రూపొందింది. ఇదే సమయంలో బాధ్యతాయుత దేశంగా ఒక ఉగ్రవాది హత్యలో నిజానిజాలు కనుక్కునేందుకు భారత్ మాతో కలిసి పని చేయాలి. అప్పటివరకు కెనడా, దాని మిత్రదేశాలు భారత్ విషయంలో సీరియస్ గానే ఉంటాయి” అని ఆయన పేర్కొన్నారు. “నిజ్జర్ హత్యలో ఇండియా ప్రమేయం లేదనేలా ఆ దేశ విదేశాంగ మంత్రి జై శంకర్ చేసిన వ్యాఖ్యలను అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ లేవనెత్తుతారని ఆ దేశం హామీ ఇచ్చింది. కెనడా గడ్డపై భారత ప్రభుత్వ ఏజెంట్లు మా పౌరుడిని హత్య చేశారని ఆరోపణలపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే అన్ని దేశాలు ఖండించాలి” అని ట్రూడో గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు చెలరేగాయి.

    భారత్, కెనడా మధ్య దౌత్య యుద్ధం నేపథ్యంలో గతవారం నుంచి భారత్‌కు కెనడా నుంచి పప్పుల దిగుమతులు మందగించాయి. దీని వల్ల కెనడాలోని రైతులకు పప్పుల ధరల్లో కోతపడే ప్రమాదం ఉంది. మరోవైపు భారతదేశంలో పప్పుల ధరలు పెరిగి వినియోగదారులకు భారంగా మారే ప్రమాదమూ నెలకొంది. వచ్చే ఏడాది భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇది రాజకీయంగా ఎదురుదెబ్బేనని భావిస్తున్నారు. మనదేశంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఎర్రపప్పు వినియోగం అధికం గా ఉంటుంది. ముఖ్యంగా నార్త్‌ ఇండియాలో ఈ వాడకం ఎక్కువగా ఉంటుంది. కెనడా నుంచి అత్యధికంగా భారత్‌కు సరఫరా అవుతుంది. ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఎగుమతి, దిగుమతులపై పరిమితులు విధించే ముప్పు ఉందని తెలుస్తోంది. అలాగే, భారత్‌తో వ్యాపార సంబంధాలపై నేరుగా ప్రభావం పడే చర్యలేమీ ప్రస్తుతం కెనడా తీసుకోలేదని కెనడా అంతర్జాతీయ వ్యవహారాల విభాగం బాధ్యులు చెబుతున్నారు.