Chandrababu: వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో గత మూడు వారాలుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. కోర్టులో సైతం ఆయనకు ఊరట దక్కడం లేదు. ఈ తరుణంలో అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కుతుందని చంద్రబాబు తరుపు న్యాయవాదులు భావించారు. ఆరోజు చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో తనపై మోపిన అభియోగాలను అత్యున్నత న్యాయస్థానం కొట్టేస్తుందని అభిప్రాయపడ్డారు. కానీ కేసు ఆరోజు విచారణకు వచ్చే అవకాశాలు లేవని సుప్రీంకోర్టు వర్గాలు చెబుతున్నాయి.
తనపై సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వరుస సెలవులు కారణంగా చంద్రబాబు పిటిషన్ పై విచారణ వాయిదా పడుతూ వస్తుంది. అక్టోబర్ 3న చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్ ప్రకటించారు. వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని చంద్రబాబు తరుపు లాయర్ సిద్ధార్థ్ లూధ్ర తో పాటు మరో సీనియర్ లాయర్ హరీష్ సాల్వే కోరారు. దీంతో అక్టోబర్ 3న తప్పకుండా విచారణ ఉంటుందని అంతా భావించారు.
అయితే అక్టోబర్ 6 వరకు ఈ పిటిషన్ లిస్ట్ చేసే అవకాశం లేనట్లు సమాచారం. ఇప్పటికే చాలా కేసులు లిస్ట్ అయ్యాయి. వాటికి ఆటంకం కలగకుండా ఉండాలంటే అక్టోబర్ 6 వరకు ఆగాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వర్గాలు చెబుతున్నాయి. అటు సుప్రీంకోర్టు వెబ్సైట్లో కేసుల లిస్టింగ్ ఆఫ్ డేట్లలో ఈనెల 6న ఈ పిటిషన్ లిస్టింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో చంద్రబాబు అక్టోబర్ 6 వరకు ఎదురు చూడక తప్పని పరిస్థితి. ఈ పరిణామాలు చంద్రబాబుకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. మరోవైపు మిగతా కేసులకు సంబంధించి చంద్రబాబు పీటీ వారెంట్లు కోరుతూ సిఐడి పిటిషన్లు వేస్తోంది. అయితే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై అనుకూల తీర్పు వస్తే.. మిగతా కేసుల నుంచి సైతం చంద్రబాబు క్షేమంగా బయట పడతారని టిడిపి శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి.