Kadapa TDP: తెలుగుదేశం పార్టీ రాయలసీమపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కేలా వ్యూహం పన్నుతోంది.గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని దక్కించుకోవడంతో అదే ఫార్ములాను కొనసాగించాలని భావిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా గెలుపును సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా నాలుగు జిల్లాల్లో 52 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రాయలసీమ జిల్లాల్లో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆశాజనకంగా ఫలితాలు వస్తాయని టిడిపి అంచనా వేస్తోంది. చిత్తూరు జిల్లాలో సైతం గణనీయమైన ఓట్లు, సీట్లు సాధించాలని భావిస్తోంది. అటు సీఎం జగన్ సొంత జిల్లా కడపలో సైతం చెప్పుకోదగ్గ స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా కడప అసెంబ్లీ సీటును ఎలాగైనా సాధించాలని గట్టి ప్రయత్నం తో ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వ్యతిరేకులను ఏకతాటిపైకి తీసుకురావాలని భావిస్తోంది. అందులో భాగంగానే కడప అసెంబ్లీ ఇంచార్జిగా ఆర్ మాధవి రెడ్డి నియమించినట్లు తెలుస్తోంది.
మాధవి రెడ్డి కడప పార్లమెంటు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ రెడ్డి భార్య. శ్రీనివాస్ రెడ్డి తండ్రి రాజగోపాల్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. వైయస్సార్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి కడపలో రాజకీయం నడిపారు. గతంలో ఓసారి టిడిపి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. మరోసారి ఆయనతో పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే తన భార్య మాధవికి కడప అసెంబ్లీ సీటు కేటాయించాలని శ్రీనివాస్ రెడ్డి హై కమాండ్ ను కోరుతూ వచ్చారు. దీంతో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమెను నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. కడప నగరపాలక సంస్థలో ఏకైక టిడిపి కౌన్సిలర్ ఉమాదేవి టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు మాత్రం మాధవి రెడ్డి వైపే మొగ్గు చూపారు.
వచ్చే ఎన్నికల్లో కడప అసెంబ్లీ స్థానం నుంచి హోరాహోరీ ఫైట్ నడవనుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంజాద్ బాషా గెలుపొందుతూ వస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. కడపలో ముస్లిం మైనారిటీలు ఎక్కువ. అంజాద్ బాషాకి వ్యతిరేకంగా మరో వర్గం టికెట్ ఆశిస్తోంది. దీంతో అక్కడ వైసీపీలో వర్గ పోరు నడుస్తోంది. అంజాద్ బాషా పై వ్యతిరేకత కూడా ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాధవి రెడ్డి పై మొగ్గు చూపడం విశేషం. కడప అసెంబ్లీ స్థానాన్ని కచ్చితంగా కైవసం చేసుకుంటామని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.