Sikkolu King Fort : రాజులు పోయారు.. రాచరికలు పోయాయి. కానీ నాటి చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన చిహ్నాలు, కట్టడాలు ఇప్పటికీ ప్రజలను కనువిందు చేస్తున్నాయి. అటువంటి చారిత్రక చిహ్నమే మందస కళింగ రాజుల కోట. శ్రీకాకుళం జిల్లాలో మారుమూల కుగ్రామమే మందస. మహేంద్రగిరులకు చేరవనే ఉంటుంది ఈ మందస. ఇక్కడి రాజుగారికోటకు సుదీర్ఘ చరిత్ర ఉంది. సుమారు 1200 సంవత్సరాల కిందట కళింగరాజులు కోటను నిర్మించారని చరిత్ర చెబుతోంది. అయితే ఇన్నాళ్లయినా ఈ కోట ఇప్పటికీ చెక్కుచెదరలేదు. కోట లోపల నాటి నిర్మాణాలు, కట్టడాలు, కళాఖండాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. కానీ నాడు రాజులు వాడిన ఆయుధ సంపత్తి మొత్తం చెద పట్టి పనికి రాకుండా పోయాయి. కానీ కోటలోని విభాగాలను నిర్వాహకులు కాపాడుకుంటూ వస్తున్నారు. సంస్థానం వారసులు నగరబాట పట్టగా.. సంస్థానానికి వస్తున్న ఆదాయంతో నిర్వాహకులు ఎలాగోలా నెట్టుకొస్తున్నారు.
మారుమూల కుగ్రామం..
శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి మందస 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పలాసకాశీబుగ్గ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.పూర్వపు మంజూషగా పిలవబడి.. తరువాత మందసగా మారింది. కళింగ సంస్థానాధీశుల ఏలుబడిలో సుదీర్ఘ కాలం సాగింది. స్వాతంత్ర్యం అనంతరం సంస్థానాధీశులు కోటలోనే ఉండేవారు. అయితే క్రమేణా వారు నగరబాట పట్టారు. మందస గ్రామం నడిబొడ్డున.. నాలుగు రహదారుల సమూహంలో రాజసానికి దర్పంగా నిలుస్తుంది ఈ కోట. రాజరిక చిహ్నంగా ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ ఈ కోట చెక్కుచెదరకుండా వినియోగంలో ఉండడం విశేషం. రాజ వంశీయులు ఏటా పండగల సమయంలో ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారని కోట నిర్వాహకులు చెప్పారు. అప్పట్లోనే చైనా, జపాన్ కళాకారులు తయారుచేసిన కళాఖండాలను కోటలో ఏర్పాటుచేశారు. ఇప్పటికీ అవి సజీవంగాన. ఉన్నాయి. సుమారు 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న కోటలోని ప్రతి విభాగానికీ ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంత విద్య, వైద్యం, ఇతరత్రా అభివృద్ధిలో సైతం సంస్థానాధీశుల పాత్ర మరువరానిది. విద్య, వైద్యం కోసం విలువైన ఆస్తులు, భవనాలను సంస్థానాధీశులు త్యాగం చేశారు.
వాసుదేవ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర..
మందస వాసుదేవ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. రాజుల కాలంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేవారు. 14వ శతాబ్దం నాటి ఈ వాసుదేవాలయాన్ని మందస సంస్థానాధీశులు ఎంతగానో అభివృద్ధి చేశారు. 17వ శతాబ్దం వరకూ మంజూష (మందస) సంస్థానాధీశులు ఆలయ నిర్వహణ చూసేవారు. 1779-1823 మధ్య కాలంలో 45వ లక్ష్మణరాజమణిదేవ్ ఆలయ వైభవానికి కృషిచేసేవారు. ఏటా 9 రోజుల బ్రహ్మోత్సవాల నిర్వహణను ప్రారంభించారు. అప్పటి నుంచి సంస్థానాధీశుల కాలం చెల్లే వరకూ ఏటా బ్రహ్మోత్సవాలు సాగేవి. తరువాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా త్రిదండి చినజీయర్‌స్వామి శ్రీకూర్మం నుంచి పూరీ వరకూ పాదయాత్ర నిర్వహించిన సమయంలో పురాతన ఆలయానికి చూసి చలించిపోయారు. ఒడిశాకు చెందిన శిల్పకళాకారులను రప్పించి ఆలయాన్ని పునర్నిర్మించారు. 2010 ఫిబ్రవరి 5న బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
ఎన్నెన్నో కట్టడాలు
అలాగే మందసలో శ్రీరాజా శ్రీనివాస్ మహారాజ్ పేరున ఒక పాఠశాల కూడా ఉంది. అంతకు పూర్వం ఈ భవనాన్ని చికిత్సాలయంగా వినియోగించేవారు. దీనిని 1901వ సంవత్సరంలో రాజు ప్రభుత్వానికి అప్పగించారు. ఆ సమయంలో ఒక సంస్కృత ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టారు. నేటికీ ఈ నిబంధన కొనసాగుతోంది. ప్రస్తుతం బాలబాలికలు కలిపి వెయ్యి మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. నేటికీ పాఠశాల భవనం చెక్కుచెదరకుండా ఉండడం దీని ప్రత్యేకత.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The story of the 1200 year old sikkolu kings fort
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com