
Ponguleti Srinivasa Reddy: పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏ ముహూర్తాన అధికార భారత రాష్ట్ర సమితి పై ధిక్కార స్వరం వినిపించారో అప్పటినుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోనూ సరికొత్త మార్పులకు బీజం వేశాయి.. శ్రీనివాసరెడ్డి వ్యతిరేక స్వరం వినిపించిన తర్వాతే అధికార బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు.. ఈ ప్రభావం రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలో అసమ్మతి రాగం వినిపించేందుకు దారి తీసింది. జనగామ నుంచి మొదలు పెడితే ఇల్లందు వరకు ప్రస్తుతం అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.
మున్సిపాలిటీలో అసమ్మతి రాగం నేపథ్యంలో అధిష్టానం కూడా ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సమాచారం.. కొందరు ఎమ్మెల్యేలపై గట్టిగా నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆ మధ్య సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో… ఆ నిర్ణయంపై పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.. ఉత్తర తెలంగాణకు చెందిన సుమారు పదిమంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ దక్కకపోవచ్చునే అంచనాలు ఉన్నాయి.
మున్సిపాలిటీలలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలు పెరిగిపోవడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసమ్మతి గళం వినిపించడంతో అధికార పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఎక్కడా లేని బలం వచ్చింది . దీంతో వారు నేరుగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.. ఉదాహరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు ఎమ్మెల్యే పై ఆ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మిగతా పురపాలకల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.. పొంగులేటి ఉదంతం వల్లే ఇదంతా జరిగిందని అధికార పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.. దీని నష్ట నివారణకు కెసిఆర్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అశ్వరావుపేట, వైరా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.. ఇక మిగతా నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.. పొరుగున ఉన్న కోదాడ, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు ప్రకటిస్తారని తెలుస్తోంది.. వైయస్ షర్మిల తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న శ్రీనివాసరెడ్డి..
హీనపక్షం ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని… రేపటి నాడు తెలంగాణలో అసెంబ్లీ ఏర్పడితే కింగ్ మేకర్ కావాలని యోచిస్తున్నారు.
