Restrictions On Paddy Cultivation: ఒక భూమిలో ఏ పంట పండుతుంది? ఏ పంట వేస్తే గిట్టుబాటు అవుతుంది? ఈ విషయాలపై రైతులకు ఉన్న పరిజ్ఞానం మరే ఎవరికీ ఉండదు. ఉదాహరణకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి బంగాళదుంపకు బదులు కోకో వేసుకో అని కెసిఆర్ ని అడిగితే ఊరుకుంటాడా? పోనీ బీన్స్ కు బదులు సోయా సాగు చేయమని చెప్తే అలానే మౌనంగా ఉంటాడా? పోపోవోయ్ నాకు చెప్పోచ్చావని ఉల్టా దబాయిస్తాడు. కానీ అదే రాష్ట్ర రైతుల విషయానికొస్తే వరి సాగు చేసుకోవద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని స్పష్టం చేస్తాడు. అసలు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకుడికి, ఆయన కింద పనిచేస్తున్న అధికారులకు ఒక పంట విధానం తెలుసా? పేరుకు వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నప్పటికీ.. ఇవాల్టికి ఆ రైతులకు ఊళ్లో ఉన్న షావుకార్లే దిక్కు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. మొన్నటిదాకా వరి సాగు వద్దు. ప్రత్యామ్నాయమే ముద్దు అని పోతరాజు మాదిరి డప్పు కొట్టి మరీ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు తన తీరు మార్చుకుంది. ఈసారి యాసంగిలో రైతులు వరి సాగు చేసుకోవచ్చని తాపీగా చెప్పింది.

వర్షాల వల్ల వరిసాగు పెరిగింది
గత కొన్ని సంవత్సరాలుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో ఆరుతడి పంటలు పండే భూముల్లో సైతం తేమ అధికంగా ఉండడంతో రైతులు వేరే ప్రత్యామ్నయం లేక వరి సాగు చేస్తున్నారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర సర్కారు పిల్లి మొగ్గలు వేయడంతో వరి సాగుచేసిన రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పైగా కోవిడ్ మొదటి దశ ప్రబలినప్పుడు తేమ పేరుతో యాసంగి సీజన్లో రైతులను అడ్డంగా దోచుకున్నారు. మిల్లర్లకు కూడా సర్కారు వత్తాసు పలకడంతో రైతుల వేదన అరణ్య రోదన అయింది. దాదాపు ఆ సీజన్లో సుమారు 1000 కోట్ల వరకు రైతుల కష్టాన్ని మిల్లర్లు దోచుకున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై రైతులు అప్పట్లో నేరుగా ప్రగతిభవన్ కే ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనతో
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య మొన్నటిదాకా వాదోపవాదాలు జరిగాయి. అయితే గత నెలలో కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతికి సంబంధించి కొత్త విధానాన్ని ప్రకటించింది. కేంద్రం ముడి బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని, నూకల ఎగుమతి పై నిషేధాన్ని విధించింది. ఈ నిబంధన నుంచి బాస్మతి, బాయిల్డ్ బియ్యాన్ని మినహాయించింది. దీనివల్ల ముడి బియ్యం ఎగుమతులు తగ్గి, బియ్యం ఎగుమతులు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది.

తద్వారా ఉప్పుడు బియ్యానికి డిమాండ్ పెరుగుతుందని.. యాసంగి ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి, ఉప్పుడు బియ్యం గా మార్చి ఎగుమతులు చేసే వెసలు బాటు పెరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. ముందే చెప్పుకున్నట్టు వర్షాలు విస్తారంగా కురవడంతో ఈ ఏడాది వానకాలం సీజన్లో తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో వరి సాగయింది. విత్తనాలు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైనప్పటికీ రైతులు సొంతంగా విత్తనాలు సమకూర్చుకున్నారు. ఏదైతే అది అయిందని మొండి పట్టుదలతో వరి సాగు చేశారు. వాస్తవానికి ఈ ఏడాది వరికి బదులు పత్తి సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని భావించింది. అయితే భారీ వర్షాలకు చాలా చోట్ల పత్తి దెబ్బ తిన్నది. ఫలితంగా పత్తి సాగు 50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మరోవైపు వరిని 45 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలనుకున్నా… రైతులు 64.54 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. ఇప్పుడు యాసంగిలో వరిసాగుపై ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయడంతో సాగు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. 2020 _21 యాసంగి సీజన్లో 52.28 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. ప్రభుత్వ సూచనల మేరకు 2021_22 యాసంగిలో 35.84 లక్షల ఎకరాలకు పరిమితమైంది.. అయితే ఈసారి ఆంక్షలు ఎత్తివేయడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. మొన్నటిదాకా పత్తి మాత్రమే సాగు చేయాలని చెప్పి.. ఇప్పుడు వరిపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడం పంటల ప్రణాళికపై సర్కారుకు అవగాహన లేదని మరోసారి స్పష్టమైంది.