Homeజాతీయ వార్తలుMadhapur Jubilee Enclave: ఎవడ్రా మనల్ని అడిగేది.. హైదరాబాద్‌ లో దర్జాగా రోడ్లు కబ్జా.. ట్రాఫిక్‌...

Madhapur Jubilee Enclave: ఎవడ్రా మనల్ని అడిగేది.. హైదరాబాద్‌ లో దర్జాగా రోడ్లు కబ్జా.. ట్రాఫిక్‌ జాంకు కారణాలివీ!

Madhapur Jubilee Enclave: హైదరాబాద్‌ విశ్వనగరంగా మారుతోందని, పెట్టుబడులకు స్వర్గధామంలా మారిందని పాలకులు చెబుతున్నారు. రవాణా వ్యవప్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరుస్తున్నామంటున్నారు. ఫ్లైఓవర్ల నిర్మాణం, రహదారుల విస్తరణ అందులో భాగమే అని పేర్కొంటున్నారు. కానీ విస్తరించిన రోడ్లు విస్తరించినట్లుగా ఉండడం లేదు. కాలనీలలో, ప్రధాన రహదారుల వెంట ఫుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న శిల్పారామం, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాల్లో ఈ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. నగరానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రశాంతగా ఉండే ప్రాంతాలు కావడంతో ఐటీ ఉద్యోగులు, పెద్దపెద్ద వ్యాపారులు, కంపెనీల యజమానులు ఈ ప్రాంతాల్లోనే నివాసం ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్నాయి. నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. దీనిని అనుగుణంగా జీహెచ్‌ఎంసీ కూడా సౌకర్యాలు కల్పిస్తోంది. కానీ కొంతమంది ఇళ్ల యజమానులు తమ వాహనాల పార్కింగ్‌ కోసం రోడ్లను సైతం ఆక్రమిస్తున్నారు.

Madhapur Jubilee Enclave
Madhapur Jubilee Enclave

ఐటీ కారిడార్‌లో ఫుట్‌ పాత్‌ల కబ్జా
ఐటీ కారిడార్‌లోని ఫుట్‌పాత్‌లు కబ్జాకు గురవుతున్నాయి. స్థానిక లీడర్లే వాటిని ఆక్రమిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మీటర్ల చొప్పున షెడ్లు వేసి టిఫిన్‌సెంటర్లు, టీ స్టాల్స్, ఇతర వ్యాపారాలకు రెంట్‌కు ఇస్తున్నారు. షాప్‌ను బట్టి నెలనెలా డబ్బు వసూలు చేస్తున్నారు. ఫుట్‌పాత్‌లపై స్థలం లేకపోవడంతో జనం రోడ్లపై నడిచి వెళ్తున్నారు. దీంతో ట్రాఫిక్‌జామ్‌ఏర్పడుతోంది.

ఎక్కడ చూసినా అదే పరిస్థితి..
ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో సాఫ్ట్‌వేర్, ఇతర కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని రోడ్ల వెంట ఉన్న ఫుట్‌పాత్‌లను అక్రమించుకుని షెడ్లు వేసేస్తున్నారు. ఐటీసీ కోహినూర్‌పక్కనే ఉన్న రోడ్డు నుంచి టీ హబ్‌వరకు ఉన్న మొత్తం 1.3 కిలోమీటర్ల ఫుట్‌పాత్‌ ఆక్రమణకు గురయ్యింది. భోజనం కోసం వచ్చే వారి కార్లు, బైక్‌లతో రోడ్డు మొత్తం నిండిపోతోంది. మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిత్యం ఈ రూట్‌లో తిరుగుతున్నా వీటిని పట్టించుకోవడంలేదు. మాదాపూర్‌అయ్యప్ప సొసైటీ 60 ఫీట్‌రోడ్‌లో టిఫిన్‌సెంటర్లు, తోపుడు బండ్లు మొత్తం రోడ్డుపైనే పెడుతున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌జామ్‌ఏర్పడి అఫీస్‌లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు నిమిషాల్లో వెళ్లే మార్గానికి అరగంట టైమ్‌ పడుతోందని వాహనదారులు చెబుతున్నారు.

Madhapur Jubilee Enclave
Madhapur Jubilee Enclave

మాదాపూర్‌ జూబిలీ ఎక్లెవ్‌ ఏరియాలో..
మాదాపూర్‌లోని జూబిలీ ఎక్లెవ్‌ ఏరియాలో రోడ్ల ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ ఏరియాలో ప్రతీ ఇంటికి సొంత వాహనాలు ఉన్నాయి. సెట్‌ బ్యాక్‌ లేకుండా నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు వాహనాల పార్కింగ్‌కు స్థలం చూపడం లేదు. దీంతో ఈ ఏరియాలోని ఇళ్లలో నివాసం ఉంటున్నవారు తమ వాహనాలను రోడ్లపక్కనే పార్కింగ్‌ చేస్తున్నారు. కొంతమంది అయితే రోడ్డు తమ సొంతం అన్నట్లుగా ఇతర వాహనాలు రాకుండా రెండ్‌ మార్క్‌ సూచికలతో, రెడ్‌ రిబ్బన్స్‌తో తమ ఇళ్లముందు ఆక్రమించేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోవడమే లేదు.

రాత్రి వేళల్లోనూ..
ఇక, ప్రతీరోజు సాయత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఫుడ్‌ట్రక్కులు, టిఫిన్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. బస్టాప్‌లైన్‌లో కూడా పెడుతుండటంతో సాయంత్రం పూట ఆర్టీసీ బస్సులను రోడ్డుపైనే ఆపాల్సి వస్తోంది. దీంతో బస్సు వెనుకాల వెహికల్స్‌బారులు తీరుతున్నాయి. ఇక్కడికి వచ్చే వారు తమ వెహికల్స్‌ను మెయిన్‌ రోడ్‌ మీదనే పార్క్‌ చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది.

Madhapur Jubilee Enclave
Madhapur Jubilee Enclave

అధికార పార్టీ నేతల వసూళ్ల దందా?
కొండాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ టీఆర్‌ఎస్‌ లీడర్‌ మాదాపూర్, కొండాపూర్‌ ఏరియాల్లో ఫుట్‌పాత్‌ఖాళీగా కనిపిస్తే ముందుగా అక్కడ తానే షెడ్‌ వేసి ఆ తర్వాత రెంటుకు ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్ట్రీట్‌ వెండర్స్‌ జిల్లా నాయకుడినని చెప్పుకుంటూ అనుచరులతో కలిసి ఫుట్‌పాత్‌పై ఉన్న షాప్, ఏరియాను బట్టి నెలకు రూ.500 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు, జీహెచ్‌ఎంసీ అధికారులను తాను మేనేజ్‌చేస్తానని వారితో చెప్తున్నట్లు సమాచారం. ఈ డబ్బులో కొంత భాగాన్ని అధికారులకు పంపిస్తుండటంతో వారు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Madhapur Jubilee Enclave
Madhapur Jubilee Enclave

పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ఆక్రమణలపై దృష్టిపెట్టకపోతే విశ్వనగరంలో రవాణా వ్యవస్థ మెరుగు పచ్చడానికి ఎన్ని నిధులు ఖర్చు చేసినా పెద్దగా ఫలితం ఉండదన్న అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version