Janasena Membership: కార్యకర్తలే ఆ పార్టీకి బలం. వారి అభిమానమే సంపద. ఎన్ని సవాళ్లు ఎదురైనా అండగా ఉంటున్నారు. తొమ్మిదేళ్లుగా నిస్వార్థంగా జెండా మోస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతున్న జనసేనాని అడుగులో అడుగేస్తున్నారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నారు. పోరాటబాటలో నడుస్తున్నారు. జనం కోసం, జనసేనాని లక్ష్యం కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారు.

జనసేన మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే రెండు విడతల్లో సభ్యత్వాన్ని నమోదు చేసింది. మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 10న మొదలుపెట్టి 28న ముగిస్తారు. ఇప్పటికే రెండు విడతల్లో పెద్ద ఎత్తున క్రియాశీలక సభ్యులు సభ్యత్వ నమోదు చేసుకున్నారు. సభ్యత్వ నమోదు కోసం దాదాపు 6600 మంది వాలంటీర్లు కష్టపడి పనిచేశారు. మొదటి, రెండు విడతల్లో సభ్యత్వ నమోదు చేపట్టిన వాలంటీర్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
పార్టీ క్రియాశీల కార్యకర్తల సభ్యత్వ నమోదు, ప్రమాద బీమా నమోదు నిమిత్తం జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూ. రెండు కోట్ల విరాళం అందించారు. మూడో విడత సభ్యత్వ నమోదు కోసం ఈనెల 10వ తేదీన జనసేనాని తన వంతుగా పార్టీకి విరాళం అందించనున్నారు. మూడో విడత సభ్యత్వ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, వీరమహిళలు బలమైన స్పూర్తితో .. సభ్యత్వ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

బీరు బాటిల్, బిర్యానీ పొట్ల కోసం పార్టీ కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు ఉన్న ఇలాంటి తరుణంలో.. నిస్వార్థంగా నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే కార్యకర్తలు ఉండటం జనసేన బలం. పవన్ కళ్యాణ్ మాటే శాసనంగా, బాటే ఆచరణీయంగా జనసేన కార్యకర్తలు ముందుకుపోతున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అధికార పార్టీతో పోరాడుతున్నారు. ఇలాంటి కార్యకర్తలు ఉండటం జనసేనకు వరమని చెప్పుకోవాలి.