
భారత్ తో ప్రత్యక్ష యుద్ధంలో తట్టుకోలేమని 1971లోనే గ్రహించిన పాకిస్థాన్ అప్పటి నుండి సీమాంతర ఉగ్రవాదం ద్వారా కాశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించేందుకు వీలు చిక్కినప్పుడల్లా ప్రయత్నాలు చేస్తూనే ఉండడం తెలిసిందే. భారత్ లో ఉగ్రదాడులు చేయడమే లక్ష్యంగా పాకిస్థాన్ శిక్షణ ఇచ్చి పంపిన లష్కరే, జైషే వంటి ఉగ్రవాద ముఠాలు ఈ మధ్య కాలంలో భారత సైన్యం ముందు తగ్గుకోలేక తోక ముడుస్తూ ఉండటం తెలిసిందే.
అందుకనే ఇప్పడు తాజాగా పాకిస్తాన్ మరో ఉగ్రవాద ముఠాను సృష్టించి కాశ్మీర్ లోయలోకి పంపినట్లు భారత్ సైన్యం గుర్తించింది. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరుతో కొత్త ఉగ్ర ముఠాను తయారు చేసింది. ఈ విషయంలో పాక్ కుయుక్తులను పసిగట్టి, తిప్పికొట్టడంలో భారత్ సైన్యం ఎప్పుడు సంసిద్దంగానే ఉంటుందని భారత్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ స్పష్టం చేశారు.
అయితే రెసిస్టెన్స్ ఫ్రంట్ ను తాము టెర్రర్ రివైవల్ ఫ్రంట్ గా పిలుస్తామని ఆయన తెలిపారు.. ఇలాంటి ఉగ్ర మూకలను భారత సేనలు సమర్థంగా అంతమొందిస్తాయని, కశ్మీర్ లో ఎలాంటి ముష్కర శక్తులు ప్రవేశించకుండా చేస్తాయని భరోసా ఇచ్చారు
ఇటీవల కశ్మీర్ లో వరుసగా ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ ఘటనలు జరగడానికి కారణంగా వాతావరణ మార్పులేనని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ చెప్పారు. చలికాలం ముగిసిన తర్వాత పాక్ ఉగ్రవాదుల చొరబాట్లతో పాటు ముష్కరుల కదలికలు పెరుగుతాయని, దీంతో ఆర్మీ కౌంటర్ ఆపరేషన్లు కూడా ఎక్కువగా ఉంటాయని వివరించారు.
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించి మద్దతు కోసం పాక్ చేసే ప్రయత్నాలను ఏ దేశాలు పట్టించుకోవడం లేదని ఆయన గుర్తు చేశారు. కశ్మీర్ లో ఏదో జరిగిపోతోందని ప్రపంచ దేశాలకు భ్రమ కల్పించేందుకు పాక్ తీవ్రమైన ఉన్మాదానికి పాల్పడే అవకాశం ఉన్నదని తెలిపారు.
అయితే భారత సైన్యం ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా నిలువరించేందుకు పూర్తి సన్నద్ధతతో ఉందని చెప్పారు. ముష్కరుల చొరబాట్లకు చెక్ పెట్టేందుకు కౌంటర్ ఆపరేషన్లు ఎప్పటికప్పుడు అప్ డేట్ చూస్తూనే ఉంటామని తెలిపారు.