Samajika Sadhikara Bus Yatra: సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజానాడిని ఇట్టే పట్టేస్తారు. తమకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నా.. అనుకూలంగా ఉన్నా వారికి తెలిసిపోతుంది. ప్రస్తుతం ఏపీలో తాము ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామని సగటు వైసిపి నేతకు తెలుసు. గత ఎన్నికల్లో జనాభాలో 70 శాతానికి పైగా ప్రజాభిమానాన్ని చూరగొన్న తమకు… ఆ స్థాయిలో ఆ పరిస్థితి లేదని ముమ్మాటికీ తెలుసు. అయినా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా వై నాట్ 175 అంటున్న జగన్.. ఆ పరిస్థితి లేదని ముమ్మాటికీ తెలుసు అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకే క్షేత్రస్థాయిలో ప్రధాన ప్రతిపక్షాన్ని ఇబ్బందుల్లో పెట్టి.. అప్పటికప్పుడు కొన్ని కార్యక్రమాలను రూపొందించి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఇలా డిజైన్ చేసినదే బస్సు యాత్ర.
సాధారణంగా అధికారంలో ఉండి ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. ప్రజలు హర్షించి స్వచ్ఛందంగా అధికార పార్టీ కార్యక్రమాలకు తరలివస్తారు. ఇప్పుడు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు ముఖం చాటేస్తున్నారంటే దాని అర్థం వ్యతిరేకతే. ఐప్యాడ్ బృందం పర్యవేక్షణలో వారిచ్చిన సలహాతో ఈ బస్సు యాత్రను రూపొందించారు. నడి రోడ్లు, ప్రధాన కూడళ్లలో సభలు ఏర్పాటు చేస్తున్నా జనాలు ముఖం చాటేస్తున్నారు. వాస్తవానికి ఇటువంటి బస్సు యాత్రను గతంలో టిడిపి మహానాడు ఏర్పాటు చేసినప్పుడే.. పోటీగా ప్రారంభించారు. అప్పట్లోనే పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు మరోసారి ప్రారంభించి చేతులు కాల్చుకుంటున్నారు. అసలు పలుకుబడి లేని మంత్రులు, నాయకుల యాత్రలకు.. వైసీపీలో పలుకుబడి ఉన్న నాయకులే ముఖం చాటేస్తున్నారు. ఇక జనం ఎలా వస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రధాన జంక్షన్ లలో 200 కుర్చీలు వేసినా నిండడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సొంత పార్టీలో సైతం అసంతృప్తి ఉందని పార్టీ నేతలకు తెలుసు. కానీ అధినేతను సంతృప్తి పరచడానికి ఈ సామాజిక బస్సు యాత్రలో వైసీపీ కీలక నేతలు పాల్గొనవలసిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ఏ కార్యక్రమం నిర్వహించకుండా.. తాము బలంగా ఉన్నామని చెప్పుకోవడం వైసీపీ నేతలకు చాలా ఈజీగా ఉండేది. పక్క నియోజకవర్గాలను, పక్క జిల్లాలను, వేరే ప్రాంతాల్లో తాము బలంగా ఉన్నామని చెప్పుకొని వైసీపీ శ్రేణులు సంతృప్తి పడేవి. కానీ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ బస్సు యాత్రలు నిర్వహించి పరువు పోగొట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఇదే పరిస్థితి అని ప్రజలకు తెలియచెప్పేలా.. చేజేతులా కార్యక్రమాలను నిర్వహించి పరువు పోగొట్టుకుంటున్నారు.
మొన్న ఆ మధ్యన గడపగడపకు మన ప్రభుత్వం అంటూ హడావిడి చేశారు. తప్పకుండా ప్రజల మధ్యకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. అలా వెళ్లకుంటే టిక్కెట్లు దక్కవని సైతం హెచ్చరించేవారు. ఎవరెవరు వెళ్తున్నారో చూడాలని ఐపాక్ టీం ను ఆదేశించేవారు. ఈ కార్యక్రమంలో యాక్టివ్ గా లేని వారిని గుర్తించి హెచ్చరించేవారు. ఇప్పుడు సామాజిక సాధికార బస్సు యాత్రకు సైతం అందరు నేతలు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. తాను మాత్రం ఈ బస్సు యాత్రకు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయించడం మిగతా నేతలకు మింగుడు పడడం లేదు. తమను పురమాయించి, ప్రజల మధ్యకు వెళ్లి పనిచేయాలని ఆదేశించడం ఏమిటని? తాను మాత్రం సేఫ్ జోన్ లో ఉండడం ఎంతవరకు సమంజసం అని సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పదవులు ఇచ్చి అధికారాన్ని తమ వద్ద ఉంచుకున్నారని.. ఇప్పుడు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలంటూ వారిని అక్కున చేర్చుకునేలా చేసుకున్నా.. ప్రజలకు అంతా తెలుసునని వైసీపీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సు యాత్ర ప్లాన్ అన్నది ముమ్మాటికీ వైఫల్య కార్యక్రమమేనని తేల్చి చెబుతున్నారు.