పరిటాల పేరు వింటేనే పార్టీకి ఒక ధైర్యం. ఆయన కుటుంబం అంటేనే దమ్ము.. ధైర్యానికి మారు పేరు. ఇది పరిటాల రవీంద్ర బతికున్నప్పటి మాట. ఆయన ఉన్నన్ని రోజులు క్యాడర్‌లో ఎలాంటి భయాలు లేవు. ఎవరికీ తలవంచే వారు కూడా కాదు. ఎప్పుడైతే రవీంద్ర హత్యకు గురయ్యారో అప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. పరిటాల కుటుంబం పేరు చెప్పినా ఎవరూ వణికేది లేదు. అంతేకాదు.. ఇప్పుడు ఆ కుటుంబం వెనుక నడిచేవారు కూడా కరువయ్యారు.
Also Read: బాబాయ్‌తోనే జగన్‌కు తలనొప్పి
పరిటాల రవీంద్ర అటు కుటుంబంలోనూ.. టీడీపీలోనూ ఆయన క్రేజ్ ఉండేది. ఎంతటా అంటే.. ఆయన అభిమానులు తెల్లవార్లు లేవగానే ఆయన ఇంటి ముందు వాలిపోయేవారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి కనిపించేది. సొంత పనుల కోసం వచ్చే వారు కొందరైతే.. కేవలం ఆయనను చూడ్డానికే వచ్చేవారు మరికొందరు. ఆయన పలకరింపు కోసం వేచి చూసేవాళ్లు. ఆయన భుజం మీద చేయి వేసి మాట్లాడితే మురిసిపోయేవారు. అలాంటి కుటుంబం ఇప్పుడు ఎందుకు చిన్నబోయింది..? ఎందుకు మౌనంగా ఉంటోంది..?
పరిటాల రవి హత్యానంతరం ఆయన భార్య సునీత రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచిన వెంటనే చంద్రబాబు ఆమెను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో సునీత పోటీ చేయకుండా తన కొడుకు పరిటాల శ్రీరామ్‌కు టిక్కెట్ అడిగి ఇప్పించుకున్నారు. కానీ.. రాప్తాడులో రవి ఓటమి పాలయ్యాడు. తదుపరి పరిణామాలను చూసి రవి అభిమానులు, అనుచరులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏడాదిన్నర నుంచి అసలు ఆ కుటుంబం బయటకే రాకపోవడాన్ని తప్పు పడుతున్నారు. ఒకప్పుడు సింహంలా ఉండిపోయిన కుటుంబం ఇప్పుడు ఎందుకు పిల్లిలా ఇంట్లోనే కూర్చుండి పోయారంటూ చాలా మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏపీలో బలపడుతున్న బీజేపీ జనసేన.. బలహీనపడుతున్న టీడీపీ?
పరిటాల కుటుంబం అమరావతిలో భూములను కొనుగోలు చేసిందని వైసీపీ నేతలు విమర్శించినా ఇప్పటివరకు వాటికి కౌంటర్ ఇవ్వలేదు. తాజాగా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి పరిటాల కుటుంబంపై పదే పదే విమర్శలు చేస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉండగా పదవులు పొంది, పవర్ పోగానే పార్టీకి దూరం కావడం ఏంటని టీడీపీ నేతలు, కార్యకర్తల్లోనూ ప్రశ్నలు వస్తున్నాయి.