NDA Meeting: ఎన్డీఏ సమావేశానికి తెలుగు దేశం పార్టీకి ఆహ్వానం అందలేదు. ఒక్క జనసేనను మాత్రమే పిలుపు రావడంతో పవన్ కల్యాణ్ ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. రాబోవు ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకొని పోటీ చేయాలని తెలుగు దేశం పార్టీ భావిస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కూడా అదే కోరుకుంటున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కొనేందుకు మూడు పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని పవన్ కల్యాణ్ పదే పదే కేంద్రంలోని పెద్దలకు విరిస్తున్నారు. అధికారికంగా పొత్తుపై ఎలాంటి ప్రకటన లేకపోయినప్పటికీ, ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి పిలుపు ఉంటుందుని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అటువంటి ప్రకటన రాకపోవడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పొత్తుపై స్పష్టత అందుకే ఇవ్వడంలేదా?
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కేంద్రంలోని బీజేపీతో కలిసి పోటీ చేసింది. పొత్తు నేపథ్యంలో చంద్రబాబు తన క్యాబినెట్లో బీజేపీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. ఆ తరువాత విభజన హామీల అమలు కోరుతూ చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఉద్యమం ప్రారంభించారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీకి బీజేపీ దూరంగా జరగడం ప్రారంభించింది. 2019 ఎన్నికల్లోనూ కలిసి రాలేదు. అదే సమయంలో అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి దగ్గరయ్యారు. పొత్తు లేకపోకపోయినా పూర్తి స్థాయిలో సహకారం అందించింది. పొత్తు జనసేనతో పెట్టుకున్నా, వైసీపీ నేతల మాటను బీజేపీ పెద్ద జవదాటడం లేదనే పుకార్లు వినిపిస్తున్నాయి. అప్పట్లో చంద్రబాబు చేసిన ఉద్యమంతో బీజేపీ నేతలు హర్ట్ అయ్యారని, ఆ ఇగోను ఇరు పార్టీలు వీడటం లేదనే తెలుస్తోంది.
పవన్ ఏం చేయబోతున్నారు..
రాబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేస్తున్న పవన్ కల్యాణ్ బీజేపీ నేతల వద్ద తెలుగు దేశం పార్టీ ప్రస్తావనను పదే పదే చేస్తున్నారు. వైసీపీ లేని కూటమి కోసం ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీని కలుపుకొని వెళితే లాభదాయకంగా ఉంటుందని సూచిస్తున్నారట. రాష్ట్రంలో గురుతర బాధ్యతను పవన్ తీసుకున్నా, బీజేపీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు టీడీపీ కూడా బీజేపీతో కలిసి వెళ్తానని బహిరంగంగా చెప్పడం లేదు. ఆహ్వానిస్తే ఆలోచన చేస్తామని అంటోంది.
బీజేపీతో లాభం లేకపోయినా..
రాష్ట్రంలో బీజేపీకి ఓటు బ్యాంకు చాలా తక్కువగానే ఉంది. అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించిన తరువాత పార్టీని బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. అయితే, ఇది ఓట్లను చీల్చడానికి ఉపయోగపడుతుంది మినహా క్లీన్ స్వీప్ అనేది సాధ్యపడకపోవచ్చు. ఇటువంటి తరుణంలో బీజేపీని రాష్ట్రంలోని పార్టీలు కలుపుకుపోయినా అంతగా ఫలితం ఉండకపోవచ్చు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని కూటమికి ఇండియా(INDIA)గా పేరు పెట్టాయి. ఇందులో చంద్రబాబు, కేసీఆర్, జగన్ లకు చోటు కల్పించకపోవడం గమనించదగ్గ విషయం. అంటే, ఈ మూడు పార్టీలు బీజేపీతో కలిసి ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా, పొత్తు విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ, ఎన్నికలు సమయంలో ఏ పార్టీ ఎవరితో కలిసివెళ్తుందో తేలిపోనుంది.