CM Jagan: రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థుల మార్పునకు జగన్ శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న కోణంలోనే ఆయన ఈ ఆలోచన చేశారు. అయితే అది మంచిదే అయినా కొన్ని రకాల సమస్యలను అధిగమించలేకపోతే అసలుకి ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. దానిని జగన్ ఎలా తట్టుకుంటారో చూడాలి. నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు కానీ.. వాటి పర్యవసానాలను సైతం ఎదుర్కోగల సామర్థ్యం ఉండాలి. ఈ విషయంలో జగన్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులను జగన్ మార్చిన సంగతి తెలిసిందే. మరో 80 మంది వరకు మార్చుతారని ప్రచారం జరుగుతోంది. కొందరికి వేరే నియోజకవర్గంలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరికొందరికి మొండి చేయి చూపుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కు సంబంధించి మంత్రులు ఆదిమూలపు సురేష్, మెరుగు నాగార్జున లను వేరే నియోజకవర్గాల బాధ్యులుగా నిర్మించారు. అయితే ఆ నియోజకవర్గాలకు వెళ్తున్న ఈ ఇద్దరు మంత్రులకు వైసీపీ చోటా నాయకులు ముఖం చాటేస్తున్నారు. వారిని కలిసేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇద్దరే కాదు.. దాదాపు మార్పులు ఉన్నచోట ఇదే పరిస్థితి ఎదురవుతోంది.
మార్పులు ఉన్నచోట బాధితులుగా మారుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రస్తుతానికి గుంభనంగా ఉన్నా.. ఎన్నికల సమయానికి ఎదురు తిరిగే అవకాశం ఉంది. చాలామంది ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపే అవకాశం ఉంది. ఒకవేళ అటువంటి నేతలు టిడిపి, జనసేనలో చేరితే ఏకంగా సీఎం జగన్ ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. దానిని కూడా తీపి కొట్టాలంటే జగన్ అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే అది అంతులేని నష్టానికి గురి చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంతవరకు సిట్టింగులతో మాట్లాడి ఒప్పించడమే సరైన చర్య అని సూచిస్తున్నారు.
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రకటించిన మేనిఫెస్టో అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. వాటికి దీటుగా తాను హామీ ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే అంతకంటే మెరుగైన పాలనను గత నాలుగు సంవత్సరాలుగా అందించానని ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. మరోసారి అధికారంలోకి వస్తే దానికి మించి మెరుగైన పాలన అందిస్తానని హామీ ఇవ్వాలి.. ప్రజలకు నమ్మించాలి. పార్టీలో తిరుగుబాట్లను నియంత్రించాలి. అసమ్మతి నాయకులను బుజ్జగించాలి. దారిలో తెచ్చుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఇబ్బందులు తప్పవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జగన్ కు పరీక్ష సమయం.