Ayodhya Temple: సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత… అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. 2020, ఆగస్టు 21న ప్రధాని నరేంద్రమోదీ రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందే అయోధ్య రామమందిరం ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో రామ మందిర నిర్మాణ ట్రస్ట్ ఈమేరకు పనులు మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా రామ మందిరం ప్రారంభోత్సవం, ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఏడాది జనవరిలో నిర్వహించడానికి శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సన్నాహాలు చేస్తోంది. జనవరి 21, 22, 23 తేదీల్లో ఒక రోజు రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శుక్రవారం వెల్లడించారు.
ప్రధానికి ఆహ్వానం..
అయోధ్య రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి సాధువులు, హిందూ పీఠాధిపతులు కూడా హాజరుకానున్నారు. 136 పీఠాలకు చెందిన 25 వేల మందికి పైగా సభ్యుల్ని విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. జనవరి నెల అంతా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు.
ఎటువంటి సభలు, సమావేశాలు లేవు..
ఇదిలా ఉంటే రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించడం లేదని ట్రస్టు తెలిసింది. ప్రశాంత వాతావరణంలో పండుగలా అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనోత్సవం జరుగుతుందని వివరించారు. రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
2020లో నిర్మాణం ప్రారంభం..
ఇదిలా ఉంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు 2020, ఆగస్టు 21న ప్రారంభమయ్యాయి. మూడు–మూడున్నరేళ్లలో మందిరం పూర్తవుతుందని నిర్మాణ పనుల్ని పర్యవేక్షించే ట్రస్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నాడే వెల్లడించింది. భారత్‌కు చెందిన అత్యంత పురాతన నిర్మాణ శైలితో పటిష్టంగా మందిర నిర్మాణాన్ని చేస్తున్నట్టుగా తెలిపింది. దీనికి సంబంధించి ట్రస్ట్ వరుస ట్వీట్లు చేసింది. ఎల్ అండ్ టీ సంస్థతో పాటుగా సీబీఆర్‌ఐ రూర్కీ, ఐఐటీ మద్రాస్ ఇంజనీర్లు మందిర నిర్మాణ స్థలంలో మట్టిని పరీక్షించారు. 36–40 నెలల్లో నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించింది.
ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా..
భూకంపాలు, తుపాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా ఆలయ నిర్మాణం సాగుతుంది. ఆలయ ఈ నిర్మాణంలో ఇనుము వాడడం లేదు. వేల ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడానికి రాతితో నిర్మించే మందిరంలో ప్రతీ రాయికి మధ్య రాగి పలకల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 18 అంగుళాల పొడవు, 30 మి.మీ. వెడల్పు, 3 మి.మీ. లోతు కలిగిన 10 వేల రాగి పలకలు వినియోగించారు. ఈ రాగి పలకలన్నీ విరాళంగా వచ్చినవే. ఈ పలకలపై దాతతోపాటు, వారి కుటుంబ సభ్యుల పేర్లు రాసుకునే అవకాశం ఇచ్చింది.
తుది మెరుగులు..
ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. వచ్చే నాలుగు నెలల్లో ఈ పనులన్నీ పూర్తవుతాయని ట్రస్టు స్పష్టం చేసింది. వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పునరుద్ఘాటించింది.