AP Transfers: ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో సీనియర్ అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐపిఎస్, డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లను బదిలీ చేసిన ప్రభుత్వం ఈసీ ఉత్తర్వుల ప్రకారం తక్షణమే బదిలీ చేసిన చోట రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
శాంతిభద్రతల అదనపు డీజీ శంఖబ్రత బాగ్జీకి హోంగార్డు ఎడిజీ గాను అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ రాజశేఖర్ బాబుకు కోస్టల్ సెక్యూరిటీ ఐజి గాను, విజయవాడ పోలీస్ కమిషనరేట్లో శాంతి భద్రతల డిసిపిగా కృష్ణకాంత్ ను, సిఐడిఎస్పీగా గంగాధరరావును నియమించారు. కాకినాడ ఎస్పి సతీష్ కుమార్ కు కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్ గా వి.రత్న, అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంట్ గా అమిత్ బర్దర్ ను నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగానికి ఆనంద రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం కల్పించారు. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కి చెందిన డిప్యూటీ కలెక్టర్లకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన డిప్యూటీ కలెక్టర్లకు ఆయా ప్రభుత్వ శాఖలు తక్షణం పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈసీ ఉత్తర్వుల ప్రకారమే ఈ బదిలీలు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తహసిల్దార్లను సైతం పెద్ద ఎత్తున బదిలీ చేశారు. జోన్ 1 లో 137 మంది, జోన్ 2 లో 170 మంది, జోన్ 3 లో 154 మంది, జోన్ 4 లో 249 మంది తహసిల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏపీ విషయంలో ఎన్నికల కమిషన్ సీరియస్ గా ఉందని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత తన విశ్వరూపం చూపిస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న అధికారుల జాబితా సిద్ధం చేసిందని టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులపై బదిలీ వేటు వేస్తుండడం విశేషం. మరోవైపు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారుల బదిలీలు జరగడం.. మరోవైపు ఇదే సమయంలో జగన్ ఢిల్లీ వెళ్తుండడం.. ఎన్నికల సమయంలో వ్యవస్థల మేనేజ్మెంట్ కు సహకరించాలని కోరడం కోసమేనని ప్రచారం జరుగుతోంది.అయితే దీనికి బిజెపి సహకరిస్తుందా? లేదా? మరి అందులో ఎంత వాస్తవం ఉంది? అన్నది చూడాలి.