BRS vs Police : ఖాకీ పవర్‌.. జైలుకు వరుస కడుతున్న కబ్జా నేతలు!

కొందరు కార్పొరేటర్లు గతంలో తాము కబ్జా చేసిన భూములు యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఫిర్యాదు చేయకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని బతిమిలాడుతున్నారు.

Written By: NARESH, Updated On : February 22, 2024 10:14 am
Follow us on

BRS vs Police : కరీంనగర్‌లో పోలీసులు పవర్‌ చూపుతున్నారు. భూ మాఫియా భరతం పడుతున్నారు. దీంతో భూకబ్జాలకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ నేతలు వరుసగా జైలుబాట పడుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ నేతలు పదేళ్లు అధికారం అడ్డుపెట్టుకుని సాగించిన భూ కబ్జాలపై చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వం మారడంతో బీఆర్‌ఎస్‌ బాధితులు పోలీస్‌ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. పదేళ్లు తాము అనుభవించిన నరకాన్ని పోలీసులకు ఏకరవు పెడుతున్నారు. గులాబీ నేతలకు వత్తాసు పలికిన పోలీసులు, రెవెన్యూ అధికారులతోపాటు దౌర్జన్యాలకు పాల్పడిన నేతలపైనా ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పోలీస్‌ కమిషనర్‌ అభిషేక్‌ మహంతికి ప్రభుత్వం ఫ్రీహ్యాండ్‌ ఇచ్చింది. దీంతో వరుసగా కబ్జా నేతల భరతం పడుతున్నారు.

సిట్‌ ఏర్పాటు చేసి..
కరీనంగర్‌లో పదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గులాబీ నేతలు సాగించిన భూదందాలపై సీపీ ప్రత్యేక దృష్టిపెట్టారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు, విచారణకు ప్రత్యేకంగా ఎకనామిక్‌ అపెన్స్‌ వింగ్‌(ఈవోడబ్ల్యూ–సిట్‌) ఏర్పాటు చేశారు. దీనికి ఏసీపీ ర్యాంకు అధికారి నేతృత్వం వహిస్తున్నారు. దీంతో బాధితులకు మరింత ధైర్యం వచ్చింది. స్వేచ్ఛగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తున్నారు. ప్రతీ ఫిర్యాదును స్వీకరిస్తున్న పోలీసులు ఆధారాలు సేకరించి కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.

కార్పొరేటర్లే కబ్జారాయుళ్లు..
కరీనంగర్‌ ఎమ్మెల్యే గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. దాదాపు 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్నారు. దీంతో ఆయన అండ చూసుకుని కార్పొరేటర్లు, మంత్రి అనుచరులు సామాన్యులను రాచి రంపాన పెట్టారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు తమకు సంబంధం లేకపోయినా తప్పుడు పత్రాలు సృష్టించడం లిటిగేషన్‌ అని ప్రచారం చేయడం, వీలైతే కబ్జా చేయడం లేదంటే సెటిల్‌మెంట్‌ పేరిట డబ్బులు వసూలు చేయడం చేస్తూ వచ్చారు. అనేక మంది బీఆర్‌ఎస్‌ బాధితులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడ్డారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళితే నాడు మంత్రిగా ఉన్న నేత ఫోన్‌ చేసి తమ వారిని ఏమీ అనొద్దని ఆదేశించేవారు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కాదు. ఇక కొందరు పోలీసులు అయితే నాటి అధికార పార్టీ నేతలకే వత్తాసు పలికి బాధితులపైనే కేసులు పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఇక కార్పొరేటర్లు ఆస్తులు కూడబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేశారు. ప్రజల సేవను గాలికి వదిలేశారు. ఇక ఇళ్లు కట్టుకుంటే కే ట్యాక్స్‌ కట్టాల్సిందే. లేదంటే రాత్రి బుల్డోజర్లను పంపించి కూల్చివేసేవారు. అయినా పోలీసులు చోద్యం చూసేవారు. ఇందుకోసం కార్పొరేటర్లు ప్రత్యేకంగా గ్యాంగులనె మెయింటేన్‌ చేశారు.

సీపీ అభయం..
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాఫీయాగా మారిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్పోరేటర్లు, వారికి అండగా నిలిచిన గ్యాంగులపై సీపీ ఉక్కుపాదం మోపుతున్నారు. సీపీ అభయం ఇవ్వడంతో బీఆర్‌ఎస్‌ బాధితులు పోలీసు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. రెండు నెలల్లోనే 720 ఫిర్యాదులు వచ్చాయంటే గులాబీ నేతల కబ్జాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

వరుసగా అరెస్టులు..
ఫిర్యాలును పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు వాటి ఆధారంగా గులాబీ నేతలను వరుసగా కటకటాల వెనుకకు పంపుతున్నారు. ఇప్పటికే ఒక మాజీ ఎంపీటీసీ, ఇద్దరు కార్పొరేటర్ల భర్తలు, ఇద్దరు కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. మరో 12 మంది కార్పొరేటర్లపై ఫిర్యాదులు వచ్చాయి. వారిపై ఆధారాల సేకరణలో పోలీసులు ఉన్నారు. స్పష్టమైన సాక్షాలు సేకరించి వారిని కూడా అరెస్టు చేస్తారని తెలుస్తోంది.

ముందు విచారణ..
సివిల్‌ వివాదాల్లో బెయిల్‌ సులువుగా వస్తుందనుకున్న నిందితులకు సీపీ మహంతి నిద్రపట్టనివ్వడం లేదు. డాక్యుమెంట్లు, సరైనా సాక్షాధారాలను సేకరించిన తర్వాతనే అరెస్టు చేస్తున్నారు. మరోవైపు విచారణలో ఏ విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గులాబీ నేతలకు వత్తాసు పలికిన పోలీసులను సైతం డీజీపీ కార్యాలయానికి సరెండర్‌ చేస్తున్నారు. ఆధారాలు పక్కాగా సేకరిస్తుండడంతో నేతలు 14 రోజులు జైలుకు వెళ్లక తప్పడం లేదు. దీంతో ఆందోళనకు గురవుతున్న కొందరు కార్పొరేటర్లు గతంలో తాము కబ్జా చేసిన భూములు యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఫిర్యాదు చేయకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని బతిమిలాడుతున్నారు.