ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా రోజురోజుకూ దిగజారుతోంది. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది ఆ ప్రభుత్వం. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడమే ఇందుకు కారణం. గత నెలాఖరులో ఆర్బీఐ నుంచి రూ.రెండు వేల కోట్లు అప్పులు చేశారు. వాటితోపాటు వచ్చిన అంతో ఇంతో పన్నుల ద్వారా ఆదాయంతో కలిపి జీతాలు చెల్లించడం ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
అలా ఆరో తేదీకి అరవై శాతం మందికి చెల్లించారు. ఇంకా నలభై శాతం మందికి చెల్లించాల్సి ఉంది. ఓ వైపు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. పోలవరం కోసం ఇవ్వాల్సిన రూ.రెండు వేల రెండు వందల కోట్లు అయినా ఇస్తే ఎలాగోలా సర్దుబాటు చేసుకుందామని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. మరో వైపు ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు.. అప్పుల కోసం బ్యాంకర్లను సచివాలయానికి పిలిచి రాచమర్యాదలు చేస్తున్నారు. అప్పు ప్లీజ్ అంటూ అభ్యర్థిస్తున్నారు.
Also Read: జగన్ సర్కార్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఇలా ఎస్‌బీఐ క్యాప్‌ను కన్సల్టెంట్‌గా పెట్టుకుని.. కమీషన్లు ఇచ్చి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి ప్రయత్నించారు. ఇలా చేసినందుకు రూ.6 వేల కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇవి మంజూరు కావాలంటే సవాలక్ష నిబంధనలు ఉన్నాయట. వాటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా రుణం వస్తుంది. అప్పుడు మిగిలిన ఉద్యోగులకు పెన్షన్, జీతాలు పంపిణీ చేస్తారు. అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులకు మూడు డీఏలు కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read: కుట్రలు, కుతంత్రాలు సాగుతున్నా ఆగని పోలవరం పనులు
ఇటీవలే.. జగన్ మూడు డీఏలు ఇస్తున్నామని ప్రకటించారు. ఎప్పుడెప్పుడు అమలు చేస్తామో కూడా చెప్పారు. లాక్ డౌన్ పేరుతో కత్తిరించిన జీతం కూడా ఐదు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో మూడు డీఏలు అసలు చెల్లించలేమని చేతులెత్తేశారు. నేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగులకు పెద్ద ఎత్తున నష్టం జరగనుంది. ఉద్యోగుల తరపున మాట్లాడేవారందరూ సామాజిక బాధ్యతగా ప్రభుత్వం వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో మొత్తంగా ఉద్యోగులకు అన్యాయం జరిగి నష్టపోతున్నారు.