Parliament Elections 2024 : సంసారాల్లో చిచ్చు పెడుతున్న పార్లమెంట్ ఎన్నికలు

కంకర్ ఇలా మాట్లాడటంతో అనుభా ఒక్కసారిగా ఆందోళనలో కూరుకుపోయింది. రాజకీయాల కోసం తనను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెబుతున్న భర్త తీరుతో ఆమె ఆవేదన చెందుతోంది.

Written By: NARESH, Updated On : April 1, 2024 9:03 am

madhyapradesh

Follow us on

Parliament Elections 2024 : రాజకీయం వల్ల సొంత అన్నదమ్ములు ప్రత్యర్థులైన ఉదంతాలు చదివే ఉంటారు. బావ బామ్మర్దుల మధ్య రాజకీయాలు వైరం పెంచిన వార్తలను చూసే ఉంటారు. కానీ తొలిసారిగా రాజకీయాలు భార్యాభర్తల మధ్య కలహాలకు కారణమయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలు ఇందుకు కారణమయ్యాయి. ఇటువంటి విచిత్ర పరిస్థితి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలా ఘాట్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

బాలా ఘాట్ పార్లమెంట్ నియోజకవర్గానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు భార్యాభర్తల మధ్య వివాదానికి కారణమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆ పార్లమెంటు స్థానంలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కంకర్ ముంజరే పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో “ఎన్నికల ప్రచారం అయ్యే వరకు ఇంట్లో నేను ఒక్కడినే ఉంటానని.. లేదా నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉండని.. ఇద్దరం ఒకే చోట ఉండడం కుదరదని” కంకర్ ముంజరే తన భార్య, కాంగ్రెస్ నాయకురాలు అయిన ఎమ్మెల్యే అనుభా ముంజరే ను కోరారు. దీంతో ఆమె ఒక్కసారిగా ఆందోళనలో కూరుకు పోయారు. భర్త అలా అనడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె కొట్టుమిట్టాడుతున్నారు.

పార్లమెంట్ మాజీ సభ్యుడిగా ఉన్న కంకర్ ముంజరే బహుజన్ సమాజ్ వాదీ పార్టీ టికెట్ పై పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్నారు. అనుభా ముంజర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న సామ్రాట్ సరస్వర్ తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. అనుభా, కంకర్ భార్యాభర్తలుగా ఒకే చోట నివాసం ఉంటూ.. ఇతర పార్టీలకు ప్రచారం చేయడం సమస్యగా మారింది. అనుభ తన భర్త తరఫున ప్రచారం చేస్తారా? లేక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారా? అంటూ పలువురు ప్రశ్నలు తెరపైకి తెస్తున్నారు.

ఈ ప్రశ్నల నేపథ్యంలో కంకర్ ముంజరే సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 19 న పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ముగిసే వరకు ఇంటికి దూరంగా ఉండు. లేదా మీ చెల్లి ఇంటికి వెళ్ళు. ఇంకా ఎక్కడికైనా వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించు. నా ఇంట్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయవద్దు. ఒకవేళ నీకు ఇల్లు వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోతే.. నేను బయటకు వెళ్లి ఎన్నికల ప్రచారం సాగిస్తాను. ఈ పరిస్థితిలో నువ్వు నాకు సహకరించు. నాతోనే వాదులాటకు దిగొద్దు. పార్టీకి సంబంధించిన విషయం ఇది. ఇందులో నేను ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని” తన భార్యతో కంకర్ స్పష్టం చేశాడు.

కంకర్ ఇలా మాట్లాడటంతో అనుభా ఒక్కసారిగా ఆందోళనలో కూరుకుపోయింది. రాజకీయాల కోసం తనను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెబుతున్న భర్త తీరుతో ఆమె ఆవేదన చెందుతోంది. ” వేరు వేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన ఇలా సంసారాల్లో చిచ్చులు పెట్టుకుంటారా.. ఇలా విభేదాలు కలిగించే రాజకీయాలు అవసరమా” అంటూ రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు.