ఏపీ సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన పథకాలకు ఆ రాష్ట్ర హైకోర్టు మోకాలడ్డుతూనే ఉంది. ముఖ్యంగా ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో న్యాయవ్యవస్థపై సంచలనమైన వ్యాఖ్యలే చేశారు. సుప్రీం సీనియర్ జడ్జి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రాష్ట్ర హైకోర్టులో తీర్పులు వెలువడుతున్నాయని ఆ వ్యాఖ్యల సారాంశం. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టుకు విన్నవించినట్లు చెప్పారు.
Also Read: హైదరాబాద్ కు ప్రయాణమా.. అస్సలు వద్దు..!
దీనిపై దేశవ్యాప్తంగా బార్ అసోసియేషన్లు నిరసనలు తెలుపుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై పలువురు న్యాయశాస్త్ర నిపుణులు, సీనియర్ అడ్వకేట్లు, రిటైర్డ్ జడ్జిలు మండిపడుతున్నారు. ఆయన తీరును ఖండిస్తూ సీజేఐ బాబ్డేకు లేఖలు రాశారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి నౌషద్ అలీ, సుప్రీంకోర్టు లాయర్ అశ్విని ఉపాధ్యాయ లేఖలు రాశారు. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని జగన్ దిగజార్చుతున్నారని నౌషద్ అలీ పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై పథకం ప్రకారమే జగన్ దాడులు చేస్తున్నారన్నారు. సీఎం జగన్ సీజేఐకి లేఖ రాయడం గర్హనీయమని తెలిపారు. ముమ్మాటికీ తప్పేనన్నారు. జగన్‌పై ఉన్న 31 కేసుల్లో తీర్పులు చెప్పే.. న్యాయమూర్తులపై ఈ లేఖ ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. తన కేసుల్లో లబ్ధి కోసమే జగన్ ఇలాంటి లేఖలు రాస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థ పటిష్టతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజాప్రతినిధులపై కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్న తీర్పుతో.. జస్టిస్ ఎన్వీరమణపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని సుప్రీంకోర్టు లాయర్ అశ్విని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థను గాడిలో పెట్టాలనుకుంటున్న.. జస్టిస్ ఎన్వీరమణపై ఆరోపణలు సరికాదన్నారు. ఫుల్ కోర్టును సమావేశపర్చి జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: ఒక రాష్ట్రం.. ఆరుగురు సీఎం అభ్యర్థులు
జగన్‌కు హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వస్తున్నవి కాకతాళీయమా.. లేక ఎవరైన డైరెక్షన్‌లో వస్తున్నాయా అనేది ఇప్పటికీ ప్రశ్నే. అటు ప్రభుత్వ పెద్దల్లోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది. అందుకే.. జగన్ అధికారం చేపట్టి 17 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడు ఒక్కసారిగా ఆయన న్యాయవ్యవస్థతోనే ఢీకొంటున్నారు. చివరికి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.