ఒకప్పుడు తెలంగాణలో వాన కోసం మబ్బులకేసి దీనంగా చూసేవారు.. అయితే ఈ సంవత్సరం మాత్రం..ఎప్పుడు పోతుందో ఈవాన అని దేవున్ని వేడుకుంటున్నారు.. తెలంగాణలో తుఫాన్ల తీవ్ర ప్రభావం ఏపీతో పోలిస్తే కాస్త తక్కువే.. మాములుగా అయితే ముసురు పట్టడం.. వర్షాలు పడడం జరుగుతుంటాయి.. అలాంటిది ఈసారి కొడుతున్న వర్షాలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా కురుస్తున్నాయి. అన్నీ వాయుగుండాలు ఒక్క తీరుగా ఉండవన్నట్లు.. మొన్న మంగళవారం తీరం దాటిన వాయుగుండం మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మరిచిపోలేని రోజును మిగిల్చింది. విషాదాన్ని, వేధనను కలిగించింది. పది ఉమ్మడి జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. ఒక్క మంగళవారం కురిసిన వర్షమెంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది.
Also Read: హైదరాబాద్ కు ప్రయాణమా.. అస్సలు వద్దు..!
ఒక్క హైదరాబాద్లోనే కాదు.. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో ఈసారి భారీ వర్షపాతం నమోదైంది..ఒక్క హైదరాబాద్లోనే సగటుకు మించి 404శాతం అధికంగా కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది 54శాతం మాత్రమే కావడం గమనార్హం. ఈ లెక్క ఒకటి చాలు.. రాష్ట్ర రాజధానిని మంగళవారం వాన ఎంతగా అతలాకుతలం చేసిందో అర్థమవుతోంది.. మూసీ నది ఉగ్రరూపం ఇంతలా ఎప్పుడు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఏకధాటి వర్షంతో ఇండ్లన్నీ మునిగి.. బాధితులు ఇంటి పైకి ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. కాలనీలు వాగుల్లా.. రోడ్లు చెరువుల్లా మారిపోయాయి.. అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు సెల్యులర్లు నిండిపోయాయి. ఇంటి బయట ఉంచిన కార్లు, బైకులు కొట్టుకపోయాయి. సిటీ పరిసరాల్లో పార్క్ చేసి ఉన్నా లోడ్ లారీలు సైతం వరదలో కొట్టుకపోయాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో తెలుస్తోంది. ఇంటి ఎత్తున వస్తున్న వరదలో చాలా మంది గల్లంతైనట్లు మీడియాలో ప్రచారమవుతోంది.. ప్రతిపక్ష నేతలు సైతం ఆరోపిస్తున్నారు. ఈ వివరాలను ప్రభుత్వం దాస్తోందని విమర్శిస్తున్నారు. అయితే గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు.
ఓ సారి వర్షపాతం లెక్కల్లోకి వెళ్తే.. అక్టోబర్ 14న రాష్ట్ర సగటు సాధారణ వర్షపాతం కేవలం 3మిల్లీమీటర్లు.. కానీ కురిసింది మాత్రం ఏకంగా 5.7మి.మీ.. జూన్ నుంచి అక్టోబర్ 14వరకు తెలంగాణ రాష్ట్ర సాధారణ వర్షపాతం 78సెం.మీ.. అయితే కురిసింది మాత్రం 120.6సెం.మీ.
మూడు నెలల పాటు రాష్ట్ర మొత్తం కురవాల్సిన వర్షం కేవలం 11సెం.మీ.మాత్రమే. అయితే ఇందుకు భిన్నంగా మంగళవారం ఒక్కరోజులో 106మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా 24గంటల వ్యవధిలో 20సెం.మీ. కంటే ఎక్కువగా వర్షం కురిసిన జిల్లాల్లో యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఉన్నాయి. 11నుంచి 20సెం.మీ. లోపు నల్గొండ, హైదరాబాద్, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, జనగామ జిల్లాలు ఉన్నాయి. ఒకటి నుంచి 11సెం.మీ. వర్షం కురిసిన జిల్లాల్లో కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్ రూరల్, అర్బన్, ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, జోగులాంబ ఉన్నాయి.
Also Read: ఒక రాష్ట్రం.. ఆరుగురు సీఎం అభ్యర్థులు
ఇంత భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. అసలే వాన జాడ లేని జిల్లాలు కూడా కొన్ని ఉన్నాయి.. కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వర్షమే లేదంటున్నారు. మంగళవారం దంచికొట్టిన వానతో వణికిపోయిన హైదరాబాద్లో బుధవారం పొద్దటి నుంచి రాత్రి 9గంటల వరకు వర్షం గెరువిచ్చింది. అయితే 9గంటల తర్వాత మళ్లీ వర్షం మొదలై అర్దరాత్రి వరకు దంచికొట్టింది. దీంతో మళ్లీ నగర వాసులు గజగజ వణికిపోయారు.