Pawan Kalyan Fighting Alone: అది 1982. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పాలిస్తున్న రోజులవి. ప్రజా హక్కులను అడ్డగోలుగా అణచివేస్తున్న రోజులు కూడా అవే. సంతలో పశువుల మాదిరిగా ముఖ్యమంత్రులను మార్చి వేస్తుంటే చోద్యం చూడడం తప్ప ప్రజలు ఏమీ చేయలేకపోతున్నారు. ఎక్కడో ఒకచోట ప్రజా ఉద్యమాలకు బీజం పడుతుంటే నాటి పాలకులు అడ్డగోలుగా తొక్కేయడం ప్రారంభించారు. ఇలాంటి తరుణంలో తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రభంజనం లాగా తన పార్టీని విస్తరించారు. దీనికి ప్రజల మద్దతు భారీగా లభించింది. ఆ రోజుల్లో కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులను నిలువరించి ఎన్టీ రామారావు ఆ స్థాయిలో పార్టీని విస్తరించడానికి ప్రధాన కారణం ఈనాడు పత్రిక. కేవలం తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ఆ పత్రిక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎందుకు రావాలో తెలియజేస్తూ పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసేది. చివరికి ఎన్టీ రామారావు స్నానం చేసినా, ప్రజలతో కూర్చొని భోజనం చేసినా వార్తలుగానే మలిచేది. ప్రజలకు ఎన్టి రామారావును మరింత చేరువ చేసేది. ఇలా పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకురావడం వెనుక తీవ్రంగా కృషి చేసింది. దీనికి రకరకాల కారణాలు వ్యాప్తిలో ఉన్నప్పటికీ నాడు ఎన్టీ రామారావుకు రామోజీరావు సామాజిక కోణం, వ్యాపార కోణంలో అండగా నిలబడ్డాడు అంటారు.. కానీ ఎటువంటి రంగులు మార్చాడు, ఆత్మగౌరవం పేరుతో తాటికాయంత అక్షరాలతో వార్తలు రాసి.. తర్వాత ఏ విధంగా తూలనాడాడు అనేది తెలుగు నాట విధితమే. నాడు 1982లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. బలంగా ఉన్న ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఎదిరించలేకపోతోంది. ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మించలేకపోతోంది. ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో పూర్తిగా విఫలమవుతోంది. ఏ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా తన సత్తా చాటలేక పోతోంది. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ సమర శంఖం పూరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మిస్తున్నారు. ఇలాంటప్పుడు బాధ్యత గల మీడియా పవన్ కళ్యాణ్ కు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అతడు చేస్తున్న ఉద్యమాలకు తన వంతు సహకారం అందించాల్సి ఉంది. అని ఏపీలో అలా జరుగుతోందా అంటే? లేదనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఈ మీడియా కూడా సహకారం అందించడం లేదు
విభజిత ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రధాన పత్రికలు ఉన్నాయి. ఈనాడు, ఆంధ్ర జ్యోతి చంద్రబాబు కీర్తనలలో ఆరి తేరిపోతున్నాయి. ఇక సాక్షి విషయానికొస్తే అది పక్కా జగన్మోహన్ రెడ్డి కరపత్రిక. ఎలక్ట్రానిక్ మీడియా విషయానికొస్తే టీవీ 9, ఎన్ టీవీ, 10 టీవీ జగన్ కు అనుకూలంగా మారిపోయాయి. సాక్షి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వంటివి చంద్రబాబుకు వత్తాసు పలుకుతుంటాయి. ప్రైమ్9, 99 టీవీ, అప్పుడప్పుడు మహా టీవీ వంటి చిన్న టీవీ చానల్స్ పవన్ వార్తలను చూపిస్తుంటాయి.
పక్షపాతం ఉండకూడదు
మీడియాకు పక్షపాతం ఉండకూడదు. ప్రజా సమస్యలను చూపించే విషయంలో తేడాలు చూపించకూడదు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా వెలుగొందుతున్న తరుణంలో అది ఒకవైపు కొమ్ము కాయడం మంచిది కాదని మీడియా పెద్దలు అంటూ ఉంటారు. కానీ వాస్తవ రూపంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది.. నాడు ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం పేరుతో ఉద్యమం చేసినప్పుడు ఈనాడు అన్ని విధాలుగా సహకరించింది. కానీ అదే పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి అస్త్ర సన్యాసం చేస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్న ముసుగులో చంద్రబాబు అనుకూల వార్తలు రాస్తుంది. వాస్తవానికి ఇలాంటి ఉద్యమాలు బాధ్యత గల ప్రతిపక్షంగా టిడిపి చేయాలి.
టిడిపి బాధ్యతను మర్చిపోయింది
టీడీపీ తన బాధ్యతను మర్చిపోవడంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి రావాల్సి వచ్చింది. వస్తూ వస్తూనే పవన్ కళ్యాణ్ వాలంటీర్లు చేస్తున్న అరాచకాల మీద ప్రశ్నలు సంధించారు. ఆయన సంధించిన ప్రశ్నల వల్లే ఏపీ క్యాబినెట్ మొత్తం పవన్ కళ్యాణ్ ను దూషించడం మొదలుపెట్టింది. అంతేకానీ వలంటీర్లను తమ సొంత పనులకు వాడుకోవడం లేదని మాత్రం చెప్పలేకపోయింది. మరోవైపు ఈ వలంటీర్ల విషయానికి సంబంధించి చర్చ తీవ్రంగా జరుగుతుండడంతో ప్రజలు కూడా మార్పు మొదలైంది. ఇలాంటి సందర్భంలో బాధ్యతగల మీడియా ఈ సమస్యను ప్రస్ఫుటంగా ప్రజల్లోకి తీసుకొస్తే చాలా బాగుండేది. ఒక సరికొత్త రాజకీయ వేదిక ఆవిర్భవించేది. కానీ దానిని చేజేతులా పచ్చ మీడియా చంపేస్తోంది. తన సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబును ప్రొజెక్ట్ చేసే పనిలో బిజీబిజీగా మారింది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పలుమార్లు స్పష్టంగా చెప్పారు. ఏ మీడియా సహకారం లేకపోయినప్పటికీ తాను బలంగా అడుగులు వేస్తానని ప్రకటించారు.. అందువల్లే సామాజిక మాధ్యమాల్లో పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలు వైరల్ గా మారాయి. అయినా సొంత సామాజిక వర్గం ప్రయోజనాల కోసం మీడియాను బంధించిన తర్వాత మిగతా వారి విషయంలో సహకారం అందిస్తారని అనుకోవడం కూడా భ్రమే.
వాటి ఆధారంగానే ఆయన రాజకీయ ప్రయాణం
“ఇల్లేమో దూరం..చుట్టేమో చీకటి. అడుగు వేద్దామంటే గాఢాంధకారం. చేతిలో మిణు మిణుకుమంటూ వెలుగుతున్న చిన్న లాంతరు.. వీటి సహాయంతోనే ప్రయాణం సాగించాలి”పవన్ కళ్యాణ్ పదే పదే వల్లె వేసే మాటలు ఇవి. అచ్చం వాటిలాగే ఆయన కూడా ఏపీ సమస్యలపై పోరాడుతున్నాడు. విజయమో వీర స్వర్గమో తెలియదు గానీ.. వెన్నుచూపకుండా బరిలోకి నిలిచాడు. అతడిని ఏం చేసుకుంటారనేది ఇక ఏపీ ప్రజల ఇష్టం.